పేజీలు

18, ఆగస్టు 2016, గురువారం

ఇండియాలో వినియోగిస్తున్న రకాల రకాల నెంబర్ ప్లేట్లు ....


రోడ్డు మీద వెలుతున్నపుడు మన కేవలం ఒకేరంగుల్లో ఉన్న నెంబర్ ప్లేట్లను కాకుండా రకరా రకాల రంగుల్లో ఉన్న నెంబర్ ప్లేట్లు గల వాహనాలను గమనిస్తుంటాం. అందులో పసుపు, ఎరుపు, తెలుపు వంటి రంగుల్లో ఎక్కువగా మనకు కనబడుతుంటాయి. కొన్ని కార్ల మీద అయితే లేత నీలం రంగులో ఉన్న నెంబర్ ప్లేట్లు కూడా ఉంటాయి. అయితే ఎందుకు ఇలా వివిధ రంగుల్లో ఉన్న నెంబర్ ప్లేట్లను వినియోగిస్తున్నారు అనే సందేహం ఇప్పటికే మీకు మొదలై ఉండవచ్చు. అందు కోసం క్రింది కథనంలో వివిధ రకాల రంగుల్లో ఉన్న నెంబర్ ప్లేట్లు మరియు వాటికి చెందిన వివరణల్ని అందిస్తున్నాము.



తెలుపు రంగు ప్లేటు మీద నలుపు రంగులో వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే, దీని అర్థం వీటిని కేవలం వ్యక్తిగత అవసరాల కోసం మాత్రమే వినియోగించాలి ఎటువంటి ఇతర వ్యాపార మరియు అద్దెల కోస వినియోగించకూడదు.

పసుపు రంగు నెంబర్ ప్లేట్ పసుపు రంగులో ఉన్న నెంబర్ ప్లేటు మీద నలుపు రంగులో వాహన రిజిస్ట్రేన్ నెంబర్ ఉంటే ఈ వాహనాలను అద్దె మరియు వ్యాపార అవసరలాకు వినియోగిస్తారు. ఇందులో ట్యాక్సీలు, క్యాబ్‌లు మరియు ట్రక్కులు ఉంటాయి. ఇటువంటి వాహనాలకు డ్రైవింగ్ పర్మిట్ కూడా ఉండాల్సి ఉంటుంది



నలుపు రంగు నెంబర్ ప్లేట్ నలుపు రంగు ప్లేటు మీద పసుపు రంగులో వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నట్లయితే ఇటువంటి వాహనాలను వ్యక్తిగతంగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లే అద్దె వాహనాలు అంటారు. మార్కెట్లో దీనికి కమర్షియల్ యుటిలిటి వెహికల్ అనే పేరు కూడా ఉంది.


ఎరుపు రంగు ప్లేటు రాష్ట్రపతి మరియు వివిధ రకాల రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన గవర్నర్లు మరియు ఇతర ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులు ఇటువంటి కార్లలో ప్రయాణిస్తారు. దీనికి ముందు వైపు ఉన్న ఎరుపు రంగు ప్లేట్ మీద బంగారు వర్ణంలో ఉన్న జాతీయ చిహ్నాన్ని ముద్రించి ఉంటారు. 


తాత్కాలిక రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు ఎరుపు లేదా తెలుపు రంగులో ఉండి మరియు వాటి మీద అక్షరాలు తెలుపు రంగులో ఉంటాయి. ముఖ్యంగా తాత్కాలికి రిజిస్ట్రేషన్ నెంబర్ ఆంగ్ల అక్షరం టిఆర్ తో ప్రారంభం అవుతుంది. వీటి తత్కాలిక పరిమితి కేవలం నెల రోజులు మాత్రమే. చాలా వరకు డీలర్లు తాత్కాలిక రిజిస్ట్రేషన్ మీద వాహనాలు అమ్మడానికి నిరాకరిస్తున్నారు. కేవలం శాశ్వత రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి మాత్రమే అమ్ముతున్నారు.



మిలిటరీ వాహనాల నెంబర్ ప్లేట్లు ఇతర వాహనాలతో పోల్చితే చాలా భిన్నంగా ఉంటాయి. పై వైపుకు చూచించిఉండే బాణపు గుర్తును ప్రారంభంలో ఇవి కలిగి ఉంటాయి. తరువాత ఉన్న రెండు అంకెలు కూడా దానిని కొనుగోలువ చేసిన సంవత్సరాన్ని సూచిస్తాయి. ప్రస్తుతం మిలిటరీ వాహనాలను డిఫెన్స్ మంత్రిత్వశాఖ విభాగం క్రింద రిజిస్ట్రేన్లను చేయిస్తారు.


మిలిటరీ నెంబర్ ప్లేట్ ప్రత్యేకతలు ఈ నెంబర్ ప్లేట్ ఉన్న వాహనాలు దేశ మొత్తం మీద ఎటువంటి ప్రదేశాలకైనా వెళ్లవచ్చు. సామాన్య ప్రజానీకాన్ని అనుమతించని ప్రదేశాలకు మరియు నో ఎంట్రీ ఉన్న ప్రదేశాలకు సైతం ఈ వాహనాలకు అనుమతులు ఉన్నాయి. ఈ తరహ నెంబర్ ప్లేట్ ఉన్న వాహనాలకు ఎవరి అనుమతులు కూడా అవసరం లేదు.



నిలం రంగు నెంబర్ ప్లేట్ ఇతర దేశాలకు చెందిన వ్యక్తులు చేయించుకునే వాహనాలకు లేత నీలం రంగు బోర్డ్ మీద తెలుపు రంగులో అక్షరాలు ఉంటాయి, ఇటువంటి ప్లేటు మీద UN, CC, CD వంటి ఆంగ్ల అక్షరాలు ఉంటాయి. అంటే వారు ఏ దేశాలకు చెందిన వారో ఇది సూచిస్తుంది. ఉదా: యుఎన్ అనగా యునైటెడ్ నేషన్స్ అంటారు.
 ఆంధ్రప్రదేశ్‌,తెలoగాణ వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ గురించి Ap02Z1245 అనే నెంబర్‌ను ఒక వాహన రిజిస్ట్రేషన్ నెంబర్‌గా పరిగణిస్తే. ఇందులోని మొదటి రెండు అంగ్ల అక్షరాలు రాష్ట్రాన్ని సూచిస్తాయి. మరియు తరువాత ఉన్న అంకెలను జిల్లా కోడ్‌గా పరిగణిస్తారు. ఆ తరువాత ఉన్న జడ్ అనే అక్షరం ఆ జిల్లా ఉన్న ప్రాంతీయ రవాణా కార్యాలయాన్ని సూచిస్తుంది. వాహనాల రిజిస్ట్రేషనే ద్వారా వచ్చే క్రమానాన్ని బట్టి చివరి నాలుగు అంకెలను కేటాయిస్తారు.

వాటర్ ప్యూరిఫయర్లలో ఏది మంచిది...? ఏది ఎలా పనిచేస్తుంది?

స్వచ్ఛమైన, పరిశుభ్రమైన నీరు సహజసిద్ధంగా లభించే పరిస్థితి నేడు దాదాపుగా కనిపించడం లేదు. నీటి కాలుష్యం ఎన్నో రకాల వ్యాధులకు కారణమవుతుందన్న విషయం తెలుసు. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు తమ ఇళ్లల్లో వాటర్ ప్యూరిఫయర్లను వాడుకోవాల్సిన పరిస్థితి. నీటిని శుద్ధి చేసేందుకు ఎన్నో రకాల వాటర్ ప్యూరిఫయర్లు నేడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి ఎలా పనిచేస్తాయి, ఉపయోగాల గురించి తెలుసుకుంటేనే గానీ తమకు అనువైది ఏదో తెలియదు.
ప్యూరిఫికేషన్ విధానాలు
క్లోరినేషన్ తో నీటిని శుద్ధి చేసి సరఫరా చేసే విధానం చాలా పురపాలక, నగర పాలక సంస్థల్లో ఉంది. క్లోరిన్ వాయువు కలుపగానే హైడ్రోక్లోరిక్ యాసిడ్ వాయువు విడుదలై సూక్ష్మ జీవులను చంపేస్తుంది. కానీ, క్లోరిన్ కలిపిన నీటిని తాగడం ఆరోగ్యానికి హానికరం.  
యాక్టివేటెడ్ కార్బన్ (బొగ్గు)
బొగ్గుతో నీటిని శుద్ధి చేసుకునే ప్రక్రియ ఈనాటిదేమీ కాదు. ఐదువేల సంవత్సరాల నుంచీ ఉంది. ఆ విధానం నుంచి అభివృద్ధి చేసిందే గ్రాన్యులర్ యాక్టివేటెడ్ కార్బన్ లేదా పౌడర్ బ్లాక్డ్ కార్బన్. యాక్టివేటెడ్ కార్బన్ కిట్ చాలా రకాల ప్రమాదకరమైన రసాయనాలను తొలగిస్తుంది. క్లోరిన్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్, అమ్మోనియా, నాచు, ఇతర పదార్థాలను శుద్ధి చేస్తుంది. కార్బన్ కు ఉండే సూక్ష్మ రంధ్రాలు నీటిలోని పెస్టిసైడ్స్ ను సైతం పట్టేస్తాయి. నీటిలో ఉన్న చెడు వాసనను కూడా తొలగిస్తాయి. ఈ కార్బన్ సెట్ ను నిర్ణీత లీటర్ల శుద్ధీకరణ తర్వాత తొలగించి కొత్తది అమర్చుకోవాల్సి ఉంటుంది. అయితే, సూక్ష్మ క్రిములు, నైట్రేట్లు, ఫ్లోరైడ్స్ ను ఇది తొలగించలేదు. సీసం, పాదరసం వంటి హెవీ మెటల్స్ ను కూడా ఫిల్టర్ చేయలేదు. సాధారణంగా 0.5 మైక్రాన్ల నుంచి 50 మైక్రాన్ల వరకు ఉన్న కలుషితాలను తొలగిస్తుంది.
మునిసిపల్ వాటర్, రక్షిత నీటి సరఫరా వ్యవస్థల ద్వారా సరఫరా అయ్యే నీటిలో సాధారణంగా టైఫాయిడ్, కలరా, డీసెంట్రీకి కారణమయ్యే సూక్ష్మజీవులు ఉండవు. ఇలాంటి చోట కార్బన్ ఫిల్టర్లు వాడుకోవచ్చు. అదే బావి నీరు, ఇతర మార్గాల ద్వారా లభించే నీటి కోసం కార్బన్ ఫిల్టర్ల కంటే ఆర్వో ఫిల్టర్లు అనువుగా ఉంటాయి. ఎందుకంటే వ్యాధి కారక బ్యాక్టీరియాను కార్బన్ తొలగించలేదు.
representation image
మెంబ్రేన్లు
పలు రకాల వాటర్ ప్యూరిఫయర్లలో నీటిని శుద్ధి చేసేందుకు మెంబ్రేన్లు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. రివర్స్ ఓస్మోసిస్ (ఆర్వో), మైక్రో ఫిల్టరేషన్ (ఎంఎఫ్), అల్ట్రా ఫిల్టరేషన్ (యూఎఫ్), నానో ఫిల్టరేషన్ (ఎన్ఎఫ్) ప్యూరిఫయర్లలో నీటి శుద్ధి కోసం పలు రకాల మెంబ్రేన్లను ఉపయోగిస్తున్నారు. వీటి మెంబ్రేన్లలోని సూక్ష్మ రంధ్రాల పరిమాణం వేర్వేరుగా ఉంటుంది. అన్నింటి కంటే అతి సూక్ష్మమైన రంధ్రాలున్న మైక్రో పర్మబుల్ మెంబ్రేన్ ను ఆర్వోలో వినియోగిస్తున్నారు. కొబ్బరి చెట్టు వేర్లు భూమిలోని మురికి నీటిని గ్రహించిన తర్వాత వేర్లలో ఉండే సూక్ష్మ పొరల ద్వారా నీరు పరిశుభ్రంగా మారి కొబ్బరిబోండంలోకి చేరుతుంది. ఇదే విధమైన టెక్నాలజీని ప్రస్తుతం మెంబ్రేన్లలో ఉపయోగిస్తున్నారు. అతి సూక్ష్మమైన రంధ్రాలతో కూడిన పలుచటి సింథటిక్ మెంబ్రేన్లను తయారు చేస్తున్నారు.  
రివర్స్ ఓస్మోసిస్ ఫిల్టర్లు (ఆర్వో)
నీటికి ఉన్న సహజసిద్ధమైన లక్షణం తక్కువ గాఢత వైపు నుంచి అధిక గాఢత ఉన్న వైపు నీరు ప్రవహిస్తుంది. దీన్నే ఓస్మోసిస్ ప్రక్రియ అంటారు. నీటి గాఢతను టీడీఎస్ గా పేర్కొంటారు. అదే రివర్స్ ఓస్మోసిస్ విధానంలో నీటిని అధిక గాఢత నుంచి తక్కువ గాఢత వైపు పంపించడం జరుగుతుంది. ఇందుకోసం నీటిని అధిక ఒత్తిడితో ఆర్వో చాంబర్ లోకి పంపుతారు. అంత ఒత్తిడితో పంపినప్పుడే అతి సూక్ష్మమైన రంధ్రాలతో కూడిన మెంబ్రేన్ నీటిని వడగట్టగలదు.
ఆర్వో మెంబ్రేన్ కు ఉండే అతి సూక్ష్మమైన రంధ్రాల నుంచి నీటి కణాలు మాత్రమే మరో వైపునకు వెళతాయి. నీటిలోని మలినాలు, బ్యాక్టీరియా మెంబ్రేన్ దగ్గరే ఆగిపోతాయి. నీటిలో కరిగి ఉన్న రసాయనాలను ఆర్వో వాటర్ ఫిల్టర్ మాత్రమే వడగట్టగలదు. అలాగే, నీటిలో కాల్షియం, మెగ్నీషియం వంటి మినరల్ అయాన్లు ఉంటాయి. ఇవి కనీస మోతాదులో అందితే శరీరానికి ఉపయోగం. ఎక్కువైతే కిడ్నీలో రాళ్లు, ఇతర సమస్యలు వస్తాయి. అందుకే నీటిలో అధిక పరిమాణంలో ఉన్న మినరల్స్ ను తొలగించుకునేందుకు ఆర్వో వాటర్ ప్యూరిఫయర్ ఉపయోగపడుతుంది. అంతేకాదు ఫ్లోరైడ్, సీసం, క్లోరిన్, పురుగుల మందు అవశేషాలు, డిటర్జెంట్, నైట్రేట్లు, సల్ఫేట్లను సైతం ఆర్వో ప్యూరిఫయర్ వడగడుతుంది.
representation image
నీరు టాప్ ద్వారా ఆర్వో వాటర్ ఫిల్టర్ లోకి ప్రవేశించగానే... మెంబ్రేన్ కంటే ముందు ఉండే సెడిమెంట్ పరికరం నీటిలోని బురదను వడగడుతుంది. తర్వాత ఉండే యాక్టివేటెడ్ కార్బన్ బ్లాక్ నీటిలోని క్లోరిన్ తో పాటు మరికొన్ని కాలుష్యాలను అడ్డుకుంటుంది. దాంతో మెంబ్రేన్ పై ఎక్కువ ఒత్తిడి పడదు. ఆ తర్వాత సెమీ పర్మబుల్ మెంబ్రేన్ ద్వారా నీరు శుద్ధి అవుతుంది. ఈ శుద్ధ జలం అక్కడి నుంచి స్టోరేజీ ట్యాంకులోకి చేరుతుంది.
ఈ ప్రక్రియ అంతా అయ్యాక చివరిలో నీటిలో ఇంకేమైనా చెడు వాసన ఉంటే కార్బన్ బ్లాక్ తొలగిస్తుంది. దీంతో శుద్ధి ప్రక్రియ ముగిసినట్టు. శుద్ధ జలంతో స్టోరేజీ ట్యాంకు నిండగానే ఆటోమేటిక్ షటాఫ్ వాల్వ్ ఇక నీటిని ట్యాంకులోకి రాకుండా ఆపుతుంది. మళ్లీ కొంత ఖాళీ ఏర్పడిన వెంటనే శుద్ధి ప్రక్రియ మొదలవుతుంది. మెంబ్రేన్ దగ్గర ఆగిపోయిన మలినాలన్నింటినీ అవుట్ లెట్ పైపు ద్వారా ఆర్వో ఫిల్టర్ ఎప్పటికప్పుడు బయటకు పంపుతూనే ఉంటుంది.
వేటి పరిమాణం ఎంత..?
ఆర్వో ప్యూరిఫయర్ లోని మెంబ్రేన్ లో ఉండే సూక్ష్మ రంధ్రాల పరిమాణం 0.0001 మైక్రాన్లు. నీటిలోని బ్యాక్టీరియా పరిమాణం 0.4 నుంచి 1 మైక్రాన్ల పరిమాణంలో ఉంటుంది. అదే వైరస్ అయితే 0.2 నుంచి 0.4 మైక్రాన్ల పరిమాణంలో ఉంటుంది. నీటిలో ఉప్పు కణాలు 0.0007 మైక్రాన్ల పరిమాణంలో ఉంటాయి. పురుగుల మందు అవశేషాలు మాత్రం 0.001 మైక్రాన్ల సైజులో ఉంటాయి. అంటే దాదాపుగా అన్ని రకాల హానికారకాలను ఆర్వో ప్యూరిఫయర్లు వడగడతాయని అర్థమవుతోంది. చిన్న పరిమాణంలో ఉన్నవాటిని కూడా వడగట్టడం వల్ల వాడుకను బట్టి ఏడాది రెండేళ్లకోసారి మెంబ్రేన్ జీవిత కాలం ముగిసిపోతుంది. అప్పుడు కొత్తదాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. దాదాపుగా అన్ని రకాల పరిశ్రమల్లోనూ, వాణిజ్య నీటి శుద్ధి కంపెనీల్లోనూ ఆర్వో వాటర్ టెక్నాలజీనే వాడుతున్నారు. ప్రపంచంలో ప్రస్తుతమున్న నీటి శుద్ధి విధానాల్లో ఇదే మెరుగైనది. టీడీఎస్ ఎక్కువగా ఉన్న నీటిని శుద్ధి చేసేందుకు ఇదే అనువైనది.  
ఇవి గమనించాలి...
ఆర్వో ప్యూరిఫయర్ లో అధిక ఒత్తిడితో నీటిని మెంబ్రేన్ ద్వారా పంపేందుకు పంప్ అవసరం అవుతుంది. అందుకోసం విద్యుత్ సౌకర్యం తప్పకుండా ఉండాలి. అలాగే, నీటిలోని మలినాలు, బ్యాక్టీరియా, సాలిడ్స్ ను బయటకు పంపేందుకు ఎక్కువ నీరు తీసుకుంటుంది. ఒక లీటర్ నీటిని శుద్ధి చేసేందుకు దాదాపు రెండు లీటర్ల నీటిని బయటకు పంపిస్తుంది. దీంతో నీటి వృధా ఉంటుంది. ఇవి లైవ్ ప్యూరిఫయర్లు. అంటే సంప్రదాయ వాటర్ ఫిల్టర్లలో పైన చాంబర్ లో నీరు పోస్తే కింద చాంబర్ కు వచ్చే విధానం కాదు. టాప్ నుంచి నేరుగా ఓ పైప్ ను కనెక్ట్ చేయాల్సి ఉంటుంది.
ఏ ఫ్లోర్ లో ఉంటున్నారు?
ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి ఏ ఫ్లోర్ లో ఉంటున్నారన్నదీ ముఖ్యమే. ఆర్వో వాటర్ ప్యూరిఫయర్లకు 5 నుంచి 40 పీఎస్ఐ (పౌండ్స్ పర్ స్వ్కేవర్ ఇంచ్) ఒత్తిడి అవసరం. పది అడుగుల ఎత్తు 5 పీఎస్ఐతో సమానం. ఉదాహరణకు ఐదంతస్తుల భవనంలో మీరు రెండో అంతస్తులో ఉన్నారనుకోండి. అక్కడి నుంచి 30 అడుగుల ఎత్తులో ఓవర్ హెడ్ ట్యాంకు ఉంది. అప్పుడు 15 పీఎస్ఐ అవుతుంది. ఈ ఒత్తిడి 40 దాటితే దాన్ని తగ్గించేందుకు రెడ్యూసర్ వినియోగించాలి.
representation image
అల్ట్రా వయలెట్ (యూవీ ఫిల్టర్లు) 
ఈ రకం ప్యూరిఫయర్లలో ముఖ్యమైన పరికరం యూవీ లైట్. గుండ్రటి చాంబర్ లో యూవీ లైట్ ఉంటుంది. ఈ చాంబర్ లోకి నీరు ప్రవేశించగానే యూవీ లైట్ ద్వారా (కనీస రేడియేషన్ స్థాయి) కిరణాలు ప్రసారం అవుతాయి. ఈ కిరణాలు సూక్ష్మక్రిములు, వైరస్, బ్యాక్టీరియా కణాల డీఎన్ఏ పై దాడి చేసి చంపేయడం లేదా వాటిని నిర్వీర్యం చేస్తాయి. అన్ని రకాల వ్యాధి కారకాలను ఇది తొలగిస్తుంది. కానీ, రసాయనాలు, రంగు, వాసనను తొలగించలేదు. అంటే సూక్ష్మక్రిములు, వైరస్ మినహా మరే ఇతర కలుషితాలను యూవీ తొలగించలేదు.
అందుకే కొన్ని రకాల కంపెనీలు యూవీ ప్యూరిఫయర్లకు సెడిమెంట్, కార్బన్ ఫిల్టర్లను కూడా అమరుస్తున్నాయి. దీంతో మడ్డితోపాటు కొన్ని రకాల కలుషితాలను తొలగించడానికి వీలవుతుంది. అయినప్పటికీ హెవీ మెటల్స్, ఫ్లోరైడ్ తొలగించలేవు. నీటిలో ఎక్కువ టీడీఎస్ ఉన్నట్లయితే యూవీ వాటర్ ఫిల్టర్లు అనువైనవి కావు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే... మురికిగా ఉన్న నీటిని యూవీ చాంబర్ లోకి పంపితే అందులోని బ్యాక్టీరియాను యూవీ కిరణాలు చంపలేవు. ఎందుకంటే బ్యాక్టీరియాను ఇతర పదార్థాలు కప్పి ఉంచుతాయి కనుక. అందుకే యూవీ ఫిల్టర్లలో యూవీ లైట్ చాంబర్ కంటే ముందు సెడిమెంట్, కార్బన్ ఫిల్టర్లు ఉంటాయి.
యూవీ లైట్ 11 వాట్ల నుంచి 60 వాట్ల వరకు విద్యుత్ ను (కెపాసిటీ, కంపెనీని బట్టి) వాడుకుంటుంది. ఈ లైట్ ను ఏడాదికోసారి మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బల్బ్ సామర్థ్యం తగ్గినట్టు మనం గుర్తించలేకపోవచ్చు. అలాంటప్పుడు బ్యాక్టీరియాపై యూవీ కిరణాల దాడి ప్రభావవంతంగా ఉండదు. అందుకే ఏడాదికోసారి మార్చుకోవడం మంచిదని నిపుణుల సూచన. అలాగే, ఫిల్టర్ కాట్రిడ్జ్ ను కూడా నిర్ణీత కాలం తర్వాత మార్చుకోవాలి. ఆర్వో ఫిల్టర్ మాదిరిగానే ఇది కూడా లైవ్ ప్యూరిఫయర్. అంటే టాప్ కు నేరుగా కనెక్ట్ చేస్తే 24 గంటలూ పనిచేసేందుకు సిద్ధంగా ఉంటుంది. పైగా విద్యుత్ ప్రసారం ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. ఆర్వోలో మాదిరిగా వ్యర్థాలను బయటకు పంపే ప్రక్రియ ఉండదు కనుక నీటి వృధా ఉండదు. దీనికి అమెరికా ఎఫ్ డీఏ ఆమోదం ఉంది. యూవీ ప్యూరిఫయర్ లో నీరు లోపలికి వెళ్లేందుకు ఇన్ లెట్, తర్వాత యూవీ చాంబర్, నీరు బయటకు వెళ్లేందుకు అవుట్ లెట్ ఉంటాయి. యూవీ చాంబర్ లో యూవీ బల్బ్, దానికి స్లీవ్ ఉంటాయి. బల్బ్ కు విద్యుత్ ప్రసారాన్ని నియంత్రించే యూవీ బల్లాస్ట్ కంట్రోలర్ యూనిట్ కూడా ఒకటి ఉంటుంది.  
అల్ట్రా ఫిల్టరేషన్ (యూఎఫ్)
ఇందులోనూ ఆర్వో వలే సెమీ పర్మబుల్ మెంబ్రేన్ ఉంటుంది. అయితే, ఆర్వో మెంబ్రేన్ తో పోలిస్తే అల్ట్రా ఫిల్టరేషన్ (యూఎఫ్) మెంబ్రేన్ రంధ్రాలు పెద్దవిగా 0.01 మైక్రాన్లు ఉంటాయి. కనుక టీడీఎస్ ను తగ్గించలేదు. అయినప్పటికీ బ్యాక్టీరియా, వైరస్ ల పరిమాణం యూఎఫ్ మెంబ్రేన్ లోని రంధ్రాల పరిమాణం కంటే ఎక్కువే. కనుక అన్ని రకాల వ్యాధి కారకాలను నిర్వీర్యం చేస్తుంది. సూక్ష్మ క్రిములు పెట్టిన గుడ్లను కూడా యూఎఫ్ మెంబ్రేన్ తొలగించగలదు. కొన్ని రకాల వాటర్ ప్యూరిఫయర్లలో (ఉదాహరణకు ప్యూర్ ఇట్) బ్యాక్టీరియాను చంపేందుకు క్లోరిన్ వాయువు ఉపయోగిస్తున్నారు. క్లోరిన్ వాయువు బ్యాక్టీరియాను చంపేస్తుంది. కానీ, నీటిలో సూక్ష్మ జీవులు పెట్టిన గుడ్లను క్లోరిన్ నిర్వీర్యం చేయలేదన్న విషయాన్ని తెలుసుకోవాలి.  
యూవీ వాటర్ ప్యూరిఫయర్ లో బ్యాక్టీరియా డీఎన్ఏ కణాలపై దాడి చేసి నిర్వీర్యం చేయడం జరుగుతుంది. ఆ బ్యాక్టీరియా నీటిలోనే ఉండిపోతుంది. కానీ, యూఎఫ్ లో ఉన్న మెంబ్రేన్ బ్యాక్టీరియాను వడగడుతుంది. ఇందులో ఫ్లషింగ్ సిస్టమ్ ఉంటుంది. దీన్ని ఎప్పటికప్పుడు ప్రెస్ చేయడం ద్వారా మెంబ్రేన్ వడగట్టిన బ్యాక్టీరియా, వైరస్, మడ్డి బయటకు వెళ్లిపోతాయి. రంధ్రాలు పెద్దవిగా ఉంటాయి కనుక నీరు మెంబ్రేన్ నుంచి వెళ్లేందుకు టాప్ నుంచి వచ్చే ప్రెషర్ సరిపోతుంది. కనుక కరెంట్ తో పనిలేదు. పైగా ఆర్వో మాదిరిగా నీటి వృధా ఉండదు. మురికి నీటిని సైతం శుద్ధి చేస్తుంది. దీంతో కాచి వడపోసుకునే పని తప్పుతుంది. పదేళ్ల వరకు నిశ్చింతగా పనిచేస్తుంది. మునిసిపల్, ప్రజా తాగు నీటి సరఫరా వ్యవస్థలు, బావులు, నదీ నీటి శుద్ధి కోసం ఆర్వో వలే యూఎఫ్ కూడా సమర్థవంతమైనది. టీడీఎస్ ను తొలగించకపోవడం ఒక్కటే ఇందులో ఉన్న ప్రధాన ప్రతికూలత.  
నానో ఫిల్టరేషన్ (ఎన్ ఎఫ్)
నానో ప్యూరిఫయర్లలో మెంబ్రేన్ల సూక్ష్మ రంధ్రాల పరిమాణం ఆర్వో మెంబ్రేన్ తో పోలిస్తే పెద్దవిగానే ఉంటాయి. కొన్ని రకాల సాల్ట్స్, హెవీ మెటల్స్ ను, నీటిలో కలిసి ఉన్న హానికారక కెమికల్స్ ను తొలగించగలదు. మోనోవాలంట్ సాల్ట్స్ అయిన సోడియం క్లోరైడ్ ను వడగట్టలేదు. తక్కువ ఒత్తిడితోనూ ఈ ప్యూరిఫయర్ పనిచేస్తుంది. సూక్ష్మ క్రిములు, వైరస్ లను వడగడుతుంది. క్యాల్షియం, మెగ్నీషియం వంటి సాల్ట్స్ ను 60 శాతం వరకు తొలగిస్తుంది. 1000 పీపీఎం లోపు టీడీఎస్ ఉన్న నీటి శుద్ధికి అనువైనది. నీటిలో దుర్వాసన ఉంటే అది కూడా తొలగిపోతుంది. దేశంలో ఆక్వాగార్డ్, టాటా తదితర కంపెనీలు ఈ టెక్నాలజీతో ప్యూరిఫయర్లను విక్రయిస్తున్నాయి. అంతేకాదు, ఆర్వో, యూవీ, యూఎఫ్ టెక్నాలజీలన్నీ ఉన్న ఫిల్టర్లను కెంట్ అందిస్తోంది. కనుక కొనుగోలుకు ముందు అందుబాటులో ఉన్న ఉత్పత్తులు, వాటిలో ఉండే సానుకూలతల సమాచారాన్ని తెలుసుకోవడం సురక్షిత నీటి కోసం తప్పదు.
సిరామిక్ ఫిల్టర్లు
చెక్క పొడి లేదా వడ్ల ఊకను మట్టితో కలిపి సిరామిక్ ఫిల్టర్లను తయారు చేస్తుంటారు. తెల్లగా గుండ్రంగా ఉండే సిరామిక్ ఫిల్టర్ క్యాండిల్స్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. వీటికి ఉంటే అతి సూక్ష్మమైన రంధ్రాలు బ్యాక్టీరియాను కిందికి రాకుండా అడ్డుకుంటాయి. క్లోరిన్, ఈ కొలి బ్యాక్టీరియాను 99 శాతం వరకు అడ్డుకుంటుంది. అయితే, కెమికల్స్ ను మాత్రం వడగట్టలేదు. నీటిని వడగట్టే ప్రక్రియ నిదానంగా ఉంటుంది. గంటకు రెండు నుంచి మూడు లీటర్లు నీటిని మాత్రమే శుద్ధి చేయగలవు. తరచుగా శుభ్రం చేసుకోవాల్సి రావడం ఇబ్బందికరం. దీనివల్ల క్యాండిల్స్ త్వరగా అరిగిపోతుంటాయి. క్యాండిల్స్ పై మడ్డి పేరుకుపోయి ఉంటే నీరు కిందకు దిగదు. 
ఏ ప్యూరిఫయర్ ఎంచుకోవాలి?
ముందుగా నివాసం ఉంటున్న ప్రాంతంలో తాగేందుకు అందుబాటులో ఉన్న నీటిలో ఏ విధమైన కలుషితాలు ఉన్నాయో తెలుసుకుంటే అప్పుడు ఏ ఫిల్టర్ తీసుకోవాలన్నది సులభంగా తెలుస్తుంది. అందుకే నీటి నమూనాలను సమీపంలోని ల్యాబ్ కు తీసుకెళితే అక్కడి నుంచి వచ్చే నివేదిక ఆధారంగా అనువైన వాటర్ ఫిల్టర్ ను కొనుగోలు చేసుకోవచ్చు. ఏ ఫిల్టర్ ఏమేమి తొలగిస్తుందో పైన చెప్పుకున్న సమాచారం ఈ విషయంలో తగినంత మార్గదర్శకంగా ఉంటుంది. 
నీటి గాఢత అంటే...?
టీడీఎస్ అంటే నీటిలో ఉండే మినరల్స్, లోహాలు, ఉప్పు మొదలైనవి. నీటిలో కరిగి ఉన్న సాలిడ్స్ ను బట్టి ఆ నీరు మంచి నీరు(సాఫ్ట్) లేక భార జలమా(హార్డ్) అన్నది నిర్ణయిస్తారు. నీటిలో కరిగి ఉన్న మొత్తం సాలిడ్స్ (టీడీఎస్) ను బట్టి ఈ నీరు ఎంత భారమన్నది తెలుస్తుంది. దీన్ని పార్ట్స్ పర్ మిలియన్ (పీపీఎం) గా చెబుతారు. సాఫ్ట్ వాటర్ లో టీడీఎస్ తక్కువగా 150 నుంచి 300 పీపీఎం వరకు ఉంటుంది. భారజలం లేదా కాలుష్యానికి గురైన నీటిలో టీడీఎస్ 500 పీపీఎం కంటే ఎక్కువ ఉంటుంది. నీటిలో టీడీఎస్ ఎంతున్నదీ తెలిపే మీటర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం... టీడీఎస్ 300 ఎంజీ లోపు ఉంటే ఆ నీరు తాగేందుకు అత్యుత్తమం. 300 నుంచి 600 ఎంజీలోపు మంచిదిగాను 600 నుంచి 900 ఎంజీ మధ్య ఉంటే పర్వాలేదు. 900కు మించి ఉంటే ఆ నీరు తాగేందుకు అనువైనది కాదు. 
కాలుష్యాలు...
భూమిపై ఉన్న నీటిలో 80 శాతం కాలుష్యమయమని వాటర్ ఎయిడ్ అనే అంతర్జాతీయ స్వచ్చంద సంస్థ 2015 నివేదిక వెల్లడిస్తోంది. ఇళ్లకు పైపుల ద్వారా సరఫరా అవుతున్న నీటి నమూనాలను దేశవ్యాప్తంగా సేకరించి పరీక్షించి తేల్చిన వాస్తవమిది. భూగర్భ జలం సైతం అధిక కాలుష్యం బారిన పడినట్టు ఎన్నో నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 15 రాష్ట్రాల్లోని భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ ఉండాల్సిన పరిమాణం (1.5పీపీఎం) కంటే ఎక్కువగా ఉంది. ఈ రాష్ట్రాల్లోని 69 జిల్లాల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఈ 15 రాష్ట్రాల్లో పశ్చిమబెంగాల్ మినహా మిగతా రాష్ట్రాల్లోని 73 జిల్లాల్లో లవణ (ఉప్పు) శాతం అధికంగా ఉన్నట్టు తేలింది. అలాగే బిహార్, రాజస్థాన్, త్రిపుర, పశ్చిమబెంగాల్లోని 23 జిల్లాల్లో భూగర్భ జలంలో ఇనుము (0.3 పీపీఎం కంటే) ఎక్కువగా ఉంది. ఏపీ, తెలంగాణ సహా 14 రాష్ట్రాల్లోని 40 జిల్లాల్లో హెవీ మెటల్స్ ఉన్నాయి. 11 రాష్ట్రాల్లోని 95 జిల్లాల్లో నైట్రేట్ పరిమాణం (45 పీపీఎం కంటే) ఎక్కువగా ఉంది.
ఏ నీటిలో ఏమున్నాయి...?
నది నీరు, పైపుల ద్వారా సరఫరా చేసే నీరు బురదగా కనిపించడం గమనించే ఉంటారు. పరీవాహక ప్రాంతాల్లోని మట్టి, ఇసుక కలవడం వల్ల ఇలా కనిపిస్తుంది. కొండ ప్రాంతాల్లో ప్రవహించే నదీ నీటిలో కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. బోరుబావులు, సముద్ర నీటిలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. సోడియం, పొటాషియం అనేవి ఈ నీటిలో ఎక్కువగా ఉంటాయి. అలాగే, బోరు బావుల నీటిలో కాల్షియం, మెగ్నీషియం కూడా గుర్తించవచ్చు. ఈ నీటిలో టీడీఎస్ ఎక్కువగా ఉంటుంది. దీనికితోడు సీసం, ఆర్సెనిక్ వంటి హానికారక కెమికల్స్ ను గుర్తించవచ్చు. అలాగే, సరస్సులు, నదులు, వాన నీటిలో గాఢత తక్కువగా ఉంటుంది. నీరు కలుషితం అయితే బ్యాక్టీరియా ఉంటుంది. నీరు ప్రవాహ గతిలో భూ గర్భం, భూ ఉపరితలంపై ఉండే ఎన్నో ఖనిజాలు, పదార్థాలను తనలో కలుపుకుంటుంది. వీటివల్ల కలిగే నష్టాలు... 
అల్యూమినియం తక్కువ పాళ్లలోనే ఉంది కదా అనుకోవడానికి లేదు. అతి తక్కువ పరిమాణంలో అయినా సరే దీర్ఘకాలం పాటు అల్యూమినియం తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది. అల్జీమర్స్ కు దారి తీయవచ్చు. లీటర్ నీటిలో 0.05 నుంచి 0.2 ఎంజీకి మించి అల్యూమినియం ఉండరాదని అమెరికా ఆహార, ఔషధ విభాగం (ఎఫ్ డీఏ) గణాంకాలు చెబుతున్నాయి. ఆర్సెనిక్ ను కేన్సర్ కారకంగా పేర్కొంటారు. ఈ హానికారక లోహం శరీరంలోకి చేరడం వల్ల చర్మం, ప్రసరణ వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదం ఉంది. లీటర్ నీటిలో 0.01 ఎంజీకి మించి ఆర్సెనిక్ ఉండడం ప్రమాదకరం.
బెరీలియం కూడా అత్యంత ప్రమాదకరమైన రసాయనం. దీనివల్ల కేన్సర్ వస్తుందని శాస్త్రీయంగా రుజువు అయింది. బేరియం లోహం పరిమితికి మించి తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంటుంది. గుండె పనితీరుపై ప్రభావం చూపుతుంది. కడుపులో వికారం, కండరాల బలహీనతకు దారితీస్తుంది. లీటర్ నీటిలో 0.004 మిల్లీగ్రాములకు మించి ఉంటే ఆ నీటిని తాగడం ప్రమాదకరమే. 
బోరాన్ అనేది ప్రత్యేకంగా కొన్ని మొక్కలకు మాత్రమే హానికరం. కాడ్మియం లోహం దీర్ఘకాలం పాటు తక్కువ పాళ్లలో శరీరానికి నీటి ద్వారా అందినా కిడ్నీ వ్యాధులకు దారితీస్తుంది. ఎముకలు పెళుసుబారడం, ఊపిరితిత్తులు పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంది. లీటర్ నీటిలో బొరాన్ 0.005 ఎంజీకి మించి ఉండరాదు. క్రోమియం పరిమితికి మించి దీర్ఘకాలం పాటు శరీరానికి అందడం వల్ల చర్మం మంటలు, లివర్, కిడ్నీ, నాడీ కణజాలం దెబ్బతినడానికి కారణమవుతుంది. లీటర్ నీటిలో 0.1ఎంజీకి మించి ఉండరాదు. 
కాపర్ ను దీర్ఘకాలం పాటు పరిమితికి మించి తీసుకున్నట్టయితే కడుపులో వికారం, వాంతుల సమస్యలు ఎదురవుతాయి. లీటర్ నీటిలో ఇది 1.3ఎంజీ వరకు ఉండవచ్చు. దంతాలు పుచ్చిపోకుండా ఫ్లోరైడ్ నివారిస్తుంది. అదే సమయంలో పరిమితికి మించి ఫ్లోరైడ్ ను దీర్ఘకాలం పాటు తీసుకోవడం వల్ల  దంతాలపై ఉండే రక్షణ పొర ఎనామిల్ దెబ్బతింటుంది. ఎముకలు పెళుసుబారిపోవడంతోపాటు కీళ్ల నొప్పులు వేధిస్తాయి. లీటర్ నీటిలో 4 ఎంజీకి మించి ఉండడం హానికరం. కలుషిత నీటిలో ఫీకల్ కోలిఫార్మ్ బ్యాక్టీరియా, ఈ కొలి తదితర బ్యాక్టీరియాలు ఉంటాయి. వీటివల్ల తీవ్ర అనారోగ్యం బారిన పడతారు. కనుక శుద్ధి చేసుకుని నీటిని తాగాల్సి ఉంటుంది. 
క్యాల్షియం ఎముకలు, దంతాలకు అవసరమైన లోహం. నీరు ఉప్పగా మారడంలో క్యాల్షియం పాత్ర కీలకమైనది. పొటాషియం రక్తపోటు తగ్గించడానికి సాయపడుతుంది. అంతేకాదు కిడ్నీలో రాళ్ళ ముప్పును తగ్గించడంతోపాటు ఎముకలు బలహీనం కాకుండా పొటాషియం కాపాడుతుంది. పెద్దలు రోజుకు 4.7 గ్రాముల పొటాషియాన్ని తీసుకోవచ్చు. ఇక ఐరన్ లోహం లీటర్ నీటిలో 0.3ఎంజీ వరకు ఉండవచ్చు. 
లీటర్ నీటిలో సీసం 0.015ఎంజీ వరకు ఉండవచ్చు. ఇది చిన్నారులకు హానికరం. సీసం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. దీంతో మెదడు సంబంధిత, కిడ్నీ సంబంధిత వ్యాధులు చుట్టుముడతాయి. లిథియం వల్ల వాంతులు, విరేచనాలు, కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. మెగ్నీషియం లీటర్ నీటిలో 125 ఎంజీకి మించి ఉంటే విరేచనాలకు దారితీస్తుంది. మేంగనీస్ పరిమాణం ఎక్కువైతే చిన్నారులు, తల్లిగా మారాల్సిన వారికి హానికలిగిస్తుంది. లీటర్ నీటిలో 0.05ఎంజీకి మించి ఉండరాదు. మోలిబ్ డెనమ్ మోతాదు నీటిలో ఎక్కువగా ఉంటే కాలేయ పరిమాణం పెరగడంతోపాటు గ్రాస్ట్రో ఇంటెస్టినల్, కిడ్నీ వ్యాధులకు కారణమవుతుంది.  ఇది లీటర్ నీటిలో 0.04ఎంజీకి మించి ఉండరాదు. 
నికెల్ లోహం దీర్ఘకాలం పాటు శరీరానికి అందితే గుండె, లివర్ దెబ్బతినడంతోపాటు శరీర బరువు తగ్గిపోతుంది. లీటర్ నీటిలో 0.1ఎంజీ వరకు ఉండవచ్చు. నైట్రేట్, నైట్రైట్ లు ఆరు నెలల్లోపు శిశువులకు ప్రమాదకరం. సిలీనియం లీటర్ నీటిలో 0.05 ఎంజీ వరకు ఉండవచ్చు. పరిమితి మేరకు తీసుకోవడం వల్ల పోషకంగా ఉపయోగపడుతుంది. కానీ పరిమితికి మించితే దీర్ఘకాలంలో కిడ్నీలు, లివర్, నరాలు, రక్త ప్రసరణ వ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది. 
వెండి లోహం మోతాదుకు మించితే ప్రాణాంతకం అవుతుంది. చర్మం రంగు పాలిపోవడానికి దారి తీస్తుంది. లీటర్ నీటిలో 0.1ఎంజీకి మించి ఉండరాదు. థాలియం దీర్ఘకాలం పాటు శరీరానికి అందితే జుట్టు రాలిపోవడం, లివర్, కిడ్నీ, వృషణాలు దెబ్బతినడానికి కారణమవుతుంది. యురేనియం దీర్ఘకాలంపాటు పరిమితికి మించి తీసుకుంటే కిడ్నీలు పాడవుతాయి. లీటర్ నీటిలో యురేనియం 0.03ఎంజీ వరకు ఉండవచ్చు. జింక్ ఎక్కువ అయితే దీర్ఘకాలంలో రక్తహీనత (అనీమియా)కు దారితీస్తుంది. లీటర్ నీటిలో జింక్ 5ఎంజీ వరకు ఉండవచ్చు. 

సమాచార హక్కు... ఈ చట్టం కింద సమాచారాన్ని ఎలా పొందచ్చు?

భారత ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ తొలిసారిగా అమెరికాలో జరిపిన పర్యటనకు ఖర్చు ఎంత అయిుందో తెలుసా…? అఫ్ఘానిస్థాన్ నుంచి మోదీ ఆకస్మికంగా పాకిస్థాన్  లో దిగిపోయి ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ తో ముచ్చటించి వచ్చినందుకు అదనంగా అయిన ఖర్చు గురించి తెలుసా…? పోనీ… ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల సందర్భంగా ప్రముఖుల భద్రతా ఏర్పాట్ల ఖర్చు గురించి అయినా తెలుసా…? తెలియకుంటే తెలుసుకోండి సమాచార హక్కు సాయంతో…  
ఆర్టీసీ పండగల సమయాల్లో ప్రత్యేక బస్సులంటూ సాధారణ చార్జీలపై 50 శాతం అదనంగా బాదుతోంది. అదేమని ప్రశ్నిస్తే...  ‘డిమాండ్ ఎక్కువగా ఉంటే వస్తువుల ధర పెరిగిపోయిన తీరు’లో రద్దీ ఎక్కువగా ఉన్నందున అదనంగా బస్సులను సమకూర్చాల్సి వస్తోంది కనుక చార్జీలు పెంచాల్సి వస్తోందని ఆర్టీసీ చెబుతుంటుంది. మరి అదే విధానంలో డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు చార్జీలు తగ్గించట్లేదు కదా...? అసలు స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ సేవలు వినియోగించుకునే ప్రయాణికులకు ఉండే హక్కుల గురించి తెలుసా? 
హైదరాబాద్ నుంచి కాశీకి ప్రయాణం. రైలు రాత్రి 9 గంటలకు బయల్దేరాలి. కానీ, అర్ధరాత్రి 2 గంటలు అయింది. అప్పటి వరకూ పడిన అవస్థలకు నిర్లక్ష్యం ఎవరిది? బాధ్యత ఎవరిది? ఇలా ఆలస్యమైతే రైల్వే చట్టాలు ఏం చెబుతున్నాయి తెలుసా...?
సమాచారం ప్రతి పౌరుడి హక్కు
పై విషయాల గురించి తెలిసిన వారు చాలా తక్కువ మందే ఉంటారు. ఇవే కాదు ఇలాంటి విషయాలు మరెన్నో ఉన్నాయి. అడగనిదే అమ్మయినా పెట్టదంటారు. అలానే సమాచారం కావాలంటే అడగాలి. అందుకే ప్రశ్నించండి. ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. ప్రభుత్వ సంస్థలు, యంత్రాంగం, పాలన, నిర్ణయాలు, జీవోలు, ప్రజా ధనం ఖర్చు, ఏదైనా కానీ పౌరుడిగా సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోండి. భారత ప్రభుత్వం సమాచార హక్కు చట్టం 2005ను పార్లమెంటులో ఆమోదించి ప్రతి పౌరుడికి సమాచారం తెలుసుకునే హక్కును ప్రసాదించింది. అప్పటికే అమల్లో ఉన్న ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2002 స్థానంలో దీన్ని తీసుకువచ్చింది. అన్ని ప్రభుత్వ విభాగాలు, వాటి పాలనా తీరు, నిధుల వినియోగంతోపాటు ప్రభుత్వం నుంచి 95 శాతం మేర నిధులు పొందుతున్న ప్రైవేటు సంస్థలు, స్వచ్చంద సంస్థలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. వీటి నుంచి పౌరులు, దేశ ప్రయోజనాల రీత్యా తగిన సమాచారాన్ని ఉచితంగా పొందవచ్చు. ప్రతి పౌరుడూ విధిగా తెలుసుకోవాల్సిన చట్టం ఇది. 
ఏ తరహా సమాచారం అడగొచ్చు?
సమాచారం అంటే ఏ రూపంలో ఉన్నది అయినా సమాచారమే. రికార్డులు, డాక్యుమెంట్లు, మెమోలు, ఈ మెయిల్స్, అభిప్రాయాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు, సర్క్యులర్లు, ఆదేశాలు, నోట్స్, అధికారిక సమావేశాల వివరాలు, లాగ్ పుస్తకాలు, కాంట్రాక్టులు, నివేదికలు, నిధుల కేటాయింపు, వ్యయం తదితర విషయాలకు సంబంధించిన ఫిజికల్, ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న సమాచారాన్ని కోరవచ్చు. ప్రింటెడ్ కాపీలు లేదా సీడీలు, ఫ్లాపీలు, డిస్క్ ల రూపంలో సమాచారం పొందవచ్చు. సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రతీ ప్రభుత్వ విభాగం సాధారణ సమాచారాన్ని ప్రజలకు స్వచ్చందంగా అందించాలి. ఈ సమాచారాన్ని బోర్డుల రూపంలో, వెబ్ సైట్లలో ప్రదర్శించాలి.  ఉద్యోగులకు సంబంధించిన విధులు, బాధ్యతలు, అధికారుల వివరాలు, నియమావళి, ముఖ్యమైన గణాంకాలు తదితర సమాచారం. అలాగే చట్టంలోని సెక్షన్ 8, 9ల లో ఎలాంటి సమాచారాన్ని కోరకూడదన్న విషయాన్ని స్పష్టం చేశారు. అయితే, అదే సమయంలో అవినీతి ఆరోపణలు, మానవ హక్కుల ఉల్లంఘనలపై ఆరోపణలు ఉంటే తగిన సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.
ఏది అడగకూడదు?
ఈ చట్టం నిబంధనలకు లోబడి పౌరులు అడిగిన సమాచారాన్ని ప్రభుత్వ అధికారులు అందించాలి. అయితే, ఇందులో కొన్ని మినహాయింపులు ఉన్నాయి. అడుగుతున్నసమాచారం వల్ల ప్రభుత్వ వనరులు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉన్నా, రికార్డుల భద్రతకు ముప్పు ఉన్నా అలాంటి సమాచారం ఇవ్వడానికి నిరాకరించవచ్చు. దేశ భద్రతకు, ఆర్థిక ప్రయోజనాలకు, పొరుగు దేశాలతో సంబంధాలకు విఘాతం కలిగించే సమాచారాన్ని ఈ చట్టం కింద తెలుసుకోవడానికి అవకాశం లేదు. పైగా పౌరులకు మాత్రమే ఈ సమాచార హక్కు కల్పించారు. కార్పొరేట్లు, అసోసియేషన్లు, కంపెనీలు సమాచారాన్ని అడగలేవు. 
సమాచారం ఎవరు ఇస్తారు? 
ప్రతీ ప్రభుత్వ విభాగంలోనూ ప్రజా సమాచార అధికారి (పీఐవో), సహాయ ప్రజా సమాచార అధికారి ఉంటారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ శాఖకు సంబంధించి తహశీల్దారులే ప్రజా సమాచార అధికారి (పీఐఓ) గా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉప తహశీల్దార్లకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఇలానే ప్రతీ ప్రభుత్వ శాఖ, విభాగంలోనూ ఓ అధికారి తన రెగ్యులర్ విధులతోపాటు పౌరులు కోరిన సమాచారం ఇచ్చే బాధ్యతలను చూస్తుంటారు. 
అలాగే పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి, ఎంపీడీవో కార్యాలయంలో ఎక్స్ టెన్షన్ ఆఫీసర్, పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి, అగ్నిమాపక కేంద్రంలో లీడింగ్ ఫైర్ మ్యాన్, మండల విద్యా శాఖ అధికారి కార్యాలయంలో మండల విద్యాధికారి, విద్యుత్ శాఖలో డీఈ (ఆపరేషన్స్), వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, మార్కెట్ కమిటీలో సీనియర్ మార్కెటింగ్ అసిస్టెంట్, మునిసిపాలిటీలో మేనేజర్, కలెక్టరేట్ లో డీఆర్వో, ఎస్పీ కార్యాలయంలో అదనపు ఎస్పీ సమాచార అధికారిగా వ్యవహరిస్తారు. ఏదేనీ ఫలానా శాఖకు సంబంధించిన సమాచారం అవసరమైతే సమీపంలోని ఆయా విభాగానికి వెళ్లి సమాచార అధికారి ఎవరు? అని అడిగితే తెలియజేస్తారు. 
దరఖాస్తు విధానం
ఏ శాఖ నుంచి సమాచారం కోరుతున్నామో ఆ శాఖ సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ను ఉద్దేశిస్తూ ఇంగ్లిష్ లేదా హిందీ లేదా ప్రాంతీయ భాషల్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును పోస్ట్ ద్వారా లేదా స్వయంగా వెళ్లి అందజేయవచ్చు. ఇందుకు నిర్ణీత దరఖాస్తు ఫామ్ అంటూ లేదు. సాధారణ తెల్లకాగితంపైనే రాసి సమర్పించవచ్చు. దరఖాస్తుకు రశీదు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. పది రూపాయల రుసుమును ఇండియన్ పోస్టల్ ఆర్డర్ లేదా నగదు రూపంలో చెల్లించాలి. అలాగే, కోరిన సమాచారాన్ని ఇచ్చేందుకు అయ్యే ఖర్చును కూడా భరించాల్సి ఉంటుంది. ప్రతి ఏ4 లేదా ఏ3 సైజు పేపర్ కు రెండు రూపాయలు, లేదా వాస్తవిక ఖర్చును భరించాలి. ఫ్లాపీ రూపంలో ఇవ్వాలంటే 50 రూపాయల చార్జీ, సీడీ 100 రూపాయలు, డీవీడీ 200 రూపాయల వ్యయం అవుతుంది. అయితే, దారిద్ర్య రేఖ కంటే దిగువన ఉన్నవారికి ఈ రుసుముల నుంచి మినహాయింపు ఉంది. ఏ భాషలో కోరితే అదే భాషలో సమాచారాన్ని ఇవ్వాలి. 
30 రోజుల్లోపు ఇవ్వకుంటే...
దరఖాస్తు అందిన 30 రోజుల్లోగా దరఖాస్తుదారుడికి కోరిన సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. వ్యక్తుల ప్రాణాలు, స్వేచ్ఛకు సంబంధించిన అంశాలైతే రెండు రోజుల్లోనే సమాచారాన్ని ఇవ్వాలి. ఒకవేళ కోరిన సమాచారం చట్టంలోని నిబంధనలకు లోబడి ఇవ్వకూడనిది అయితే దరఖాస్తును తిరస్కరిస్తారు. తిరస్కరణకు గల కారణాన్ని తెలియజేస్తూ అప్పీలేట్ అథారిటీ వివరాలు కూడా ఇస్తారు. సహేతుకంగా లేదనిపిస్తే అప్పిలేట్ అథారిటీకి వెళ్లాల్సి ఉంటుంది. 
నిర్ణీత కాల వ్యవధిలోపు స్పందన లేకున్నా దాన్ని తిరస్కరణగానే భావించి అప్పీల్ కు వెళ్లవచ్చు. అలాగే, ఇచ్చిన సమాచారం పట్ల సంతృప్తిగా లేకున్నా కూడా ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ వద్దకు వెళ్లాలి. సీనియర్ ర్యాంకులో ఉన్న సీపీఐవో అధికారికి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి. దీన్ని సంబంధిత అధికారి 30 నుంచి 45 రోజుల్లోపు పరిష్కరించాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోపు పరిష్కరించకపోయినా, ఇచ్చిన ఆదేశాల పట్ల సంతృప్తిగా అనిపించకపోయినా 90 రోజుల్లోపు రాష్ట్ర, కేంద్ర సమాచార కమిషన్ వద్దకు రెండో అప్పీల్ కు వెళ్లవచ్చు. అలాగే, దరఖాస్తు స్వీకరించకపోయినా, లేదా సంబంధిత ప్రభుత్వ విభాగంలో సమాచార అధికారిని నియమించకపోయినా అప్పీల్ కు వెళ్లవచ్చు. మరిన్ని వివరాలకుhttp://www.rti.gov.in  వెబ్ సైట్ ను చూడగలరు. 
ఇవ్వకపోతే జరిమానాలు
కోరిన సమాచారాన్ని ఇవ్వడంలో విఫలమైతే సంబంధిత అధికారి నిబంధనల మేరకు పరిహారం ఇవ్వాల్సి రావచ్చు. సరైన ఆధారాలతో దరఖాస్తు చేసుకుంటే కమిషన్ ఈ దిశగా ఆదేశాలిస్తుంది. అంతేకాదు దరఖాస్తు తీసుకోకపోవడం, ఉద్దేశపూర్వకంగా సమాచారం అందించడంలో జాప్యం, అసంపూర్తి, తప్పుడు సమాచారం ఇవ్వడం నేరం. ఇలా చేస్తే పీఐవోలకు రూ.25వేల వరకు జరిమానా విధించవచ్చు. క్రమశిక్షణ చర్యలకు కూడా కమిషన్ ఆదేశించవచ్చు. ఒకవేళ తప్పుడు సమాచారం ఇచ్చినట్టయితే రాష్ట్ర సమాచార కమిషన్ కు అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడా న్యాయం జరగకపోతే న్యాయస్థానాన్నిఆశ్రయించవచ్చు. తెలుగు రాష్ట్రాల రాష్ట్ర సమాచార కమిషన్ల వెబ్ సైట్ లింకులు… 

బి కాంప్లెక్స్ విటమిన్లతో మానసిక ఆరోగ్యం

శారీరక ఆరోగ్యానికే కాదు మానసిక ఆరోగ్యానికీ బి విటమిన్లు అవసరం. శరీరంలోని అనేక జీవక్రియలు సవ్యంగా కొనసాగాలన్నా... మెదడు, నాడీ వ్యవస్థ సరిగా పనిచేయాలన్నా.. బి కాంప్లెక్స్ విటమిన్లు శరీరానికి అందాల్సిందే. లేకుంటే డిప్రెషన్ దగ్గరి నుంచి ఏ నిర్ణయమూ తీసుకోలేని గందరగోళ మానసిక స్థితి దాకా ఎన్నో సమస్యలు వస్తాయి. అంతేకాదు కళ్లు, చర్మం ఆరోగ్యంగా ఉండడానికి అత్యవసరం. విటమిన్ బి లో మళ్లీ చాలా ఉప రకాలు ఉన్నాయి. వీటన్నింటికీ కూడా వేర్వేరు లక్షణాలు, ప్రయోజనాలు ఉన్నాయి. అన్నింటినీ కలిపి బి కాంప్లెక్స్ విటమిన్ అంటారు. బి కాంప్లెక్స్ విటమిన్లు చాలా వరకు మనం నిత్యం తీసుకునే ఆహార పదార్థాల్లోనే లభిస్థాయి. ముఖ్యంగా మాంసాహారం నుంచి ఎక్కువశాతం అందుతాయి. శరీరంలో పిండి పదార్థాలు జీర్ణం కావడానికి, కండరాల పటుత్వానికి, నాడీ వ్యవస్థ, రోగ నిరోధక వ్యవస్థలు సరిగా పనిచేయడానికి ఇవి తోడ్పడుతాయి. గుండె, కాలేయం, మూత్ర పిండాలు సహా ముఖ్యమైన అవయవాలన్నీ సరిగా పనిచేసేందుకూ ఇవి అవసరం.
బి కాంప్లెక్స్ లోని ప్రధానమైనవి
  • బి1- థయమిన్
  • బి2- రైబోఫ్లేవిన్
  • బి3- నియాసిన్ లేదా నియాసినమైడ్
  • బి4 - అడినైన్
  • బి5- పాంటోథెనిక్ ఆమ్లం
  • బి6- పైరిడాక్సిన్
  • బి7- బయోటిన్
  • బి8- అడెనోసిన్
  • బి9- ఫోలిక్ ఆమ్లం
  • బి10- పారా అమినో బెంజోయిక్ ఆమ్లం
  • బి12- సయానో కోబాలమైన్
ఇవేగాకుండా మరికొన్ని బి కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఉన్నట్లు పలువురు శాస్త్రవేత్తలు గుర్తించారు. కానీ పూర్తిస్థాయిలో నిర్ధారణ కాకపోవడం, వాటి వలన శరీరానికి, మన ఆరోగ్యానికి చెప్పుకోదగిన స్థాయిలో ప్రయోజనం లేకపోవడం వంటి కారణాల వల్ల ఆ విటమిన్ల గురించి ఎక్కువగా ప్రచారం లేదు. బి కాంప్లెక్స్ విటమిన్లలోనూ బి1, బి2, బి3, బి5, బి6, బి9, బి12 అత్యంత ప్రధానమైనవి.
నాడీ వ్యవస్థకు బీ1
బి కాంప్లెక్స్ విటమిన్లలో మొదటగా కనుగొన్నది థయమిన్ నే. అందుకే దీన్ని బి1గా పిలుస్తారు. ఇది చాలా రకాల ఆహార పదార్థాల్లో విస్తృతంగా లభిస్తుంది. నాడీ వ్యవస్థ, గుండె సమర్థవంతంగా పనిచేయడానికి, కండరాల పటుత్వానికి, పేగుల్లో పిండి పదార్థాల సంశ్లేషణకు ఈ విటమిన్ అవసరం. ముఖ్యంగా కండరాల నుంచి నాడులకు, నాడుల నుంచి కండరాలకు సమాచార ప్రసారం చేసే ఎలక్ట్రోలైట్లను రవాణా చేయడంలో దీనిది కీలకపాత్ర. కంటి సమస్యలైన క్యాటరాక్ట్, గ్లకోమాలను నివారిస్తుంది. అల్జీమర్స్ తో బాధపడుతున్నవారికి థయమిన్ అందిస్తే.. వారి జ్ఞాపక శక్తి ఎంతో మెరుగుపడినట్లు అమెరికన్ మెడికల్ రీసెర్చ్ ఫౌండేషన్ పరిశోధకులు నిర్ధారించారు.
లోపిస్తే నాడీ వ్యవస్థకు దెబ్బ
థయమిన్ లోపిస్తే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. నాడీ వ్యవస్థ, మెదడు, కండరాలు, గుండె సంబంధించిన సమస్యలు వస్తాయి. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ వ్యవస్థ దెబ్బతింటుంది. థయమిన్ లోపం వల్ల బెరిబెరి వ్యాధి వస్తుంది. నాడుల పనితీరు దెబ్బతినడం, కాళ్లలో వాపు, గుండె పెద్దది కావడం, తిమ్మిర్లు వంటివి దీని లక్షణాలు. గుండె కొట్టుకునే వేగంలో తీవ్రస్థాయిలో హెచ్చుతగ్గులు నెలకొని.. రక్తపోటు పడిపోతుంది. కాళ్లు, ఊపిరితిత్తుల్లో నీరు చేరుతుంది. ఇది అంతిమంగా మరణానికి దారితీసే ప్రమాదం కూడా ఉంది. కేవలం తల్లిపాలు మాత్రమే తాగే పిల్లల్లో థయమిన్ లోపం ఏర్పడి బెరిబెరి వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల పిల్లలు సరిగా స్పందించకపోవడం, గొంతు ద్వారా చేసే ధ్వని స్థాయి తగ్గిపోవడం జరుగుతుంది. చివరికి గుండె విఫలమయ్యే ప్రమాదం ఉంటుంది. ఇక దీని లోపంతో ‘వెర్నిక్-కొర్సాకోఫ్’గా పేర్కొనే మెదడు, నాడీ సంబంధిత వ్యాధి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల స్వల్పకాలిక మతిమరుపు, ఆందోళన, కలవరపాటు, సరిగా నడవలేకపోవడం, కంటి సమస్యలు తలెత్తుతాయి.
- 14 ఏళ్లపైన పురుషులకు రోజుకు 1.2 మిల్లీగ్రాముల థయమిన్ అవసరం. అదే 14 నుంచి 18 మధ్య ఉన్న స్త్రీలకు 1 మిల్లీగ్రాము, 19 ఏళ్లు దాటిన స్త్రీలకు 1.1 మిల్లీగ్రాముల చొప్పున థయమిన్ అవసరం.
- థయమిన్ (బి1) మాంసం, కాలేయం, పాలు, గుడ్లు, ఓట్స్, ఆరెంజ్, ధాన్యాల పై పొర, వేరుశనగ, ఈస్ట్ లలో లభిస్తుంది. బియ్యం, గోధుమలు వంటి వాటిని పాలిష్ చేసి పై పొర తొలగించడం, వండే ముందు ఎక్కువగా కడగడం వల్ల థయమిన్ వెళ్లిపోతుంది.
- థయమిన్ లోపం ఉన్న వారిలో డిప్రెషన్, తీవ్ర ఉద్వేగం, మానసికంగా అస్థిరంగా ఉండడం, భయం, కలవరపాటు, నిద్రలేమి, నీరసం, మగతగా ఉండడం, ఆకలి మందగించడం, చిన్నపాటి నొప్పిని కూడా తట్టుకోలేకపోవడం, వెన్నునొప్పి, కండరాల క్షీణత, మలబద్ధకం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
- ఆహారంలోని థయమిన్ శరీరానికి అందకుండా ఆల్కాహాల్ అడ్డుకుంటుంది. అందువల్లే విపరీతంగా ఆల్కాహాల్ తీసుకునేవారిలో ఆందోళన, మతిమరపు, వణుకు వంటి లక్షణాలు తలెత్తుతాయి. ఆల్కాహాల్ కు దూరంగా ఉండడం శ్రేయస్కరం.
- థయమిన్ ను సంగ్రహించలేని జన్యు లోపాలు ఉన్నవారి పిల్లలకు కూడా బెరిబెరి వ్యాధి జన్యుపరంగా సంక్రమించే అవకాశం ఉంటుంది. అందువల్ల వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.
- దీని లోపాన్ని గుర్తించడానికి ప్రత్యేకమైన వైద్య పరీక్షలంటూ ఏమీ లేవు. లక్షణాలు, రక్తంలో ఎలక్ట్రోలైట్ల స్థాయిని పరిశీలించడం ద్వారా వైద్య నిపుణులు లోపాన్ని అంచనా వేస్తారు.
రైబోఫ్లేవిన్ నోటికి మంచిది
శరీరంలో జీర్ణక్రియకు, శక్తి ఉత్పాదన ప్రక్రియకు రైబోఫ్లేవిన్ (విటమిన్ బి2) ఎంతో కీలకం. కండరాలు పెరగడానికి తోడ్పడుతుంది. పిండి పదార్థాలు (కార్బొహైడ్రేట్స్), ప్రొటీన్లు, కొవ్వులు, అమైనో ఆమ్లాలు జీర్ణం కావడానికి.. శరీరం ఆక్సిజన్ ను వినియోగించుకునేలా విటమిన్ బి2 పనిచేస్తుంది. ఇది చాలా రకాల ఆహార పదార్థాల్లో విస్తృతంగా లభిస్తుంది. చర్మ ఆరోగ్యానికి, రక్త కణాల ఉత్పత్తికి ఇది అత్యవసరం. కంటి ఆరోగ్యం కాపాడడంలో రైబోఫ్లేవిన్ ది కీలకపాత్ర. కంటిలో యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసే గ్లుటాథియోన్ ను ఇది రక్షిస్తుంది. క్యాటరాక్ట్ రాకుండా నిరోధిస్తుంది. ముఖ్యంగా రక్తంలో ఇతర విటమిన్లు, మినరల్స్, శరీరానికి అవసరమైన రసాయనాలు ఉండే స్థాయిని రైబోఫ్లేవిన్ ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు విటమిన్ బి6, బి9లను శరీరం వినియోగించుకోవడానికి రైబోఫ్లేవిన్ తప్పనిసరి. అంతేకాదు ఐరన్ ను శరీరం సంగ్రహించడానికి కూడా ఇది తప్పనిసరి. అందువల్లే రైబోఫ్లేవిన్ లోపం ఉన్నవారు తగిన స్థాయిలో ఐరన్ ను తీసుకున్నా కూడా వారిలో రక్త హీనత నెలకొంటుంది. మైగ్రేన్ (పార్శ్వనొప్పి)తో బాధపడుతున్నవారు రైబోఫ్లేవిన్ తీసుకుంటే తగిన ఉపశమనం లభిస్తుంది. నోటి మూలల్లో, పెదవులు పగిలినట్లయితే రైబోఫ్లేవిన్ లోపం ఉన్నట్లుగా గుర్తించవచ్చు.
లోపంతో నోటి పగుళ్లు
సాధారణ పోషకాహారం తీసుకునేవారికి రైబోఫ్లేవిన్ లోపం తక్కువే. కానీ కొన్నేళ్లుగా మాత్రం చాలా మందిలో ఈ విటమిన్ లోపం కనిపిస్తోంది. సాధారణంగా ఇతర బి విటమిన్ల లోపంతోపాటే రైబోఫ్లేవిన్ లోపం కూడా ఏర్పడుతుంది. అనారోగ్యకర ఆహార అలవాట్లు, అతిగా ఆల్కాహాల్ తీసుకోవడం, ధూమపానం వంటివి దీని లోపానికి కారణం. అంతేగాకుండా యుక్త వయసు వారిలో, వృద్ధుల్లో కూడా లోపం కనిపించే అవకాశముంది. రైబోఫ్లేవిన్ లోపం వల్ల రక్త హీనత, గొంతు, నోరు, పెదవుల పగుళ్లు, వాపు, నొప్పి, చర్మం మంట వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముక్కు చుట్టూ, కళ్ల వద్ద ఎరుపు రంగులో మచ్చలు కనిపించవచ్చు. ఇక లేటు వయసులో గర్భం దాల్చినవారిలో రైబోఫ్లేవిన్ లోపం వల్ల అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుంది. మూత్ర పరీక్షల ద్వారా ఈ విటమిన్ లోపాన్ని గుర్తించవచ్చు.
- రైబోఫ్లేవిన్ సాధారణంగా పురుషులకు రోజుకు 1.3 మిల్లీగ్రాములు, స్త్రీలకు 1.1 మిల్లీగ్రాములు అవసరం. మూడేళ్లలోపు పిల్లలకు 0.8 మిల్లీగ్రాముల వరకు, గర్భంతో ఉన్న మహిళలకు 1.7 మిల్లీగ్రాముల వరకు అవసరం.
- రైబోఫ్లేవిన్ (బి2) ఎక్కువగా గోధుమ మొలకలు, తృణ ధాన్యాలు, సోయాబీన్, ఆకుకూరలు, బాదం, వేరుశనగ వంటి గింజలు, గుడ్లు, మాంసం, పాలు, పాల ఉత్పత్తులు, పుట్టగొడుగులు, బ్రాకొలీ వంటి వాటిలో ఎక్కువగా లభిస్తుంది. ఆహారాన్ని ఎక్కువగా కడిగినా, ఎక్కువ వేడితో ఉడికించినా ఈ విటమిన్ నశిస్తుంది.
- రైబోఫ్లేవిన్ లోపం ఏర్పడినప్పుడు దానిని ఇతర విటమిన్లతో కలిపి సప్లిమెంట్ల రూపంలో గానీ, నేరుగా గానీ అందిస్తారు. లోపం తీవ్రంగా ఉన్నప్పుడు నేరుగా కండరాల్లోకి ఇంజెక్షన్ రూపంలోనూ ఇస్తారు.
- ఆల్కాహాల్ ఎక్కువగా తీసుకునేవారికి, కేన్సర్ బాధితులు, కాలిన గాయాలైనవారు, దెబ్బలు తగిలిన సమయంలో, చిన్నపేగులు, కాలేయ సంబంధిత వ్యాధులు ఉన్నవారికి, కొద్ది రోజులుగా డయేరియా, జ్వరం, ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నవారికి విటమిన్ బి2 ఎక్కువ మొత్తంలో అవసరం.
- రైబోఫ్లేవిన్ ను అధిక మోతాదులో తీసుకున్నా పెద్దగా ప్రమాదకరమేమీ కాదు. ఎందుకంటే ఎక్కువగా ఉన్న ఈ విటమిన్ మూత్రాశయంలో వడగట్టబడి, మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. అయితే కొందరిలో మాత్రం డయేరియా వంటి లక్షణాలు కనిపించవచ్చు.
మెదడుకు పుష్టినిచ్చే నియాసిన్
చర్మం ఆరోగ్యంగా ఉండడానికి, శరీరంలో ఆహార పదార్థాల నుంచి శక్తి ఉత్పత్తి కావడానికి నియాసిన్ (విటమిన్ బి3) అవసరం. దీనిని మొదట్లో నికోటినిక్ యాసిడ్ విటమిన్ గా పేర్కొనేవారు. ఇది నియాసినమైడ్, ఇనోసిటోల్ హెక్సానియోటినేట్ లనే రెండు రూపాల్లో ఉంటుంది. అడ్రినల్ గ్రంథులు హార్మోన్లను, కాలేయం స్రావాలను తయారు చేసుకోవడానికి ఇది తోడ్పడుతుంది. శరీరంలో మంచి (హెచ్ డీఎల్) కొలెస్ట్రాల్ స్థాయులను 30 శాతం వరకు పెంచుతుంది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు మెదడులో దెబ్బతిన్న కణాలను పునరుద్ధరించడంలో నియాసిన్ ది కీలక పాత్ర. ఇక చర్మ కేన్సర్లను కూడా నిరోధిస్తుంది. కాలేయం నుంచి హానికర రసాయనాలను తొలగిస్తుంది. మైగ్రేన్ తో బాధపడుతున్నవారికి నియాసిన్ అందజేస్తే ఉపశమనం ఉంటుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇక కలరాతో కూడిన డయేరియా లక్షణాలను నియాసిన్ నియంత్రిస్తుంది. పురుషుల్లో అంగస్తంభన సమస్య నుంచి బయటపడేందుకు నియాసిన్ తోడ్పడుతుందని కూడా గుర్తించారు.
లోపిస్తే పెల్లాగ్రా మహమ్మారి దాడి
సరైన పోషకాహారం తీసుకునేవారిలో నియాసిన్ (విటమిన్ బి3) లోపం సాధారణంగా తక్కువే. కేవలం ధాన్యాలను మాత్రమే ఎక్కువగా వినియోగిస్తూ పప్పులు, ఇతర నూనె గింజలు, మాంసం, గుడ్లు తిననివారిలో నియాసిన్ లోపం కనిపిస్తుంది. స్వల్ప స్థాయి లోపం వల్ల తీవ్రమైన నీరసం, పుండ్లు, డిప్రెషన్, అజీర్ణం వంటి వంటి సమస్యలు వస్తాయి. ఇక తీవ్రమైన లోపం కారణంగా పెల్లాగ్రా వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుంది. చర్మంపై ఎర్రగా మారి పొలుసులుగా ఊడిపోవడం, మంటలు, అజీర్ణం సమస్యలు, తీవ్ర విరేచనాలు, మానసిక ఆందోళన దీని లక్షణాలు. చేతులు, పాదాలు, మెడ చుట్టూ ముఖంపై పెద్దగా మచ్చలు ఏర్పడుతాయి. జీర్ణ వ్యవస్థలోని అన్ని అవయవాలపై ప్రభావం పడుతుంది. నోరు, నాలుక వాపు, పగుళ్లు వస్తాయి. గొంతు మంట, రక్త విరేచనాలు కమ్ముకుంటాయి. మెదడు పనితీరు దెబ్బతింటుంది. ఉద్రేకం, లేనిది ఊహించుకోవడం, గందరగోళం, జ్ఞాపక శక్తి క్షీణించడం, నడకలో సమన్వయం కోల్పోవడం, నిద్రలేమి వంటివి నెలకొంటాయి. చివరికి మృత్యువు బారిన పడే అవకాశం కూడా ఉంటుంది.
- నియాసిన్ సాధారణ వ్యక్తులకు రోజుకు 14 నుంచి 16 మిల్లీగ్రాముల వరకు అవసరం. శారీరక శ్రమ అధికంగా చేసేవారికి 21 మిల్లీగ్రాముల వరకు అవసరం. మూడేళ్లలోపు పిల్లలకు 8 మిల్లీగ్రాముల వరకు,  గర్భిణులు, బాలింతలకు 20 మిల్లీగ్రాముల వరకు అవసరం.
- విటమిన్ బి3 ఎక్కువగా ఈస్ట్, మాంసం, చేపలు, పాలు, గుడ్లు, బాదాం వంటి గింజలు, వేరుశనగ వంటి నూనె గింజలు, ఆకుపచ్చని కూరగాయలు, బీన్స్, పప్పు దినుసుల్లో ఉంటుంది.
- మొక్కజొన్నలో విటమిన్ బి3గానీ, ట్రిఫ్టోఫాన్ గానీ లభించదు. దీంతో మొక్కజొన్నను ప్రధాన ఆహారంగా వినియోగించే వారిలో దీనిలోపం ఏర్పడి పెల్లాగ్రా వ్యాధి వస్తుంది.
- పాలు వంటి కొన్ని పదార్థాల్లో నేరుగా నియాసిన్ లభించదు. వాటిలో ట్రిఫ్టోఫాన్ అనే రసాయనం ఉంటుంది. దీనిని మన శరీరం నియాసిన్ గా మార్చుకుంటుంది.
- నియాసిన్ సప్లిమెంట్ల వినియోగంతో పలు స్వల్ప దుష్పరిణామాలు కూడా ఉన్నాయి. చర్మంపై దురద, వేడిగా అనిపించడం, గ్యాస్ సమస్యలు, నోటిలో కొంత నొప్పిగా ఉండడం వంటివి తలెత్తవచ్చు. అందువల్ల వైద్యుల సూచనల మేరకు మాత్రమే వినియోగించాలి.
పాంటోథెనిక్ ఆమ్లంతో కొలెస్ట్రాల్ కంట్రోల్
బి కాంప్లెక్స్ కు చెందిన ఇతర విటమిన్ల తరహాలోనే బి5 విటమిన్ (పాంటోథెనిక్ ఆమ్లం) కూడా ఆహారం నుంచి శరీరానికి శక్తిని సమకూర్చడంలో అత్యంత కీలకం. ఇది చాలా రకాల ఆహార పదార్థాల్లో లభిస్తుంది. నాడీ వ్యవస్థ, కళ్లు, చర్మం, కాలేయం, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండడానికి ఈ పాంటోథెనిక్ ఆమ్లం అవసరం. కణాల్లో జరిగే అనేక రసాయన ప్రక్రియలకు కీలకమైన కోఎంజైమ్-ఏ రూపంలో ఉండేది పాంటోథెనిక్ ఆమ్లమే. ఎర్ర రక్త కణాలు తయారు కావడానికి, జీర్ణ వ్యవస్థ సక్రమంగా కొనసాగడానికి, కొలెస్ట్రాల్ సంశ్లేషణకు తోడ్పడుతుంది. ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించడానికి, లైంగిక హార్మోన్లను విడుదల చేయడానికి విటమిన్ బి5 చాలా అవసరం. రక్తంలో కొలెస్ట్రాల్ శాతం తక్కువగా ఉండేలా చేయడం ద్వారా గుండెకు, రక్త నాళాలకు మేలు చేస్తుంది.
లోపిస్తే.. కాళ్లలో మంటలు
సాధారణంగా విటమిన్ బి5 లోపం చాలా తక్కువ. తీవ్రమైన పోషకాహార లోపానికి గురైనవారికే ఈ సమస్య వచ్చే అవకాశముంది. దీని లోపం వల్ల ప్రత్యేకంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలేవీ వస్తున్నట్లుగా గుర్తించలేదు. అందువల్ల దీనిపై ప్రపంచవ్యాప్తంగా పెద్దగా పరిశోధనలు కూడా జరగలేదు. కానీ పాంటోథెనిక్ ఆమ్లం లోపం వల్ల కాళ్లు, పాదాల్లో తీవ్రమైన మంట మండే సమస్య వస్తుంది. ఇక ఆయాసం, చిరాకు, నిద్రలేమి, కుంగుబాటు, కడుపు నొప్పి, కాళ్ల మంటలు, కడుపు నొప్పి, శ్వాస వ్యవస్థ ఇన్ఫెక్షన్లు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే బి కాంప్లెక్స్ కు చెందిన ఇతర ప్రధాన విటమిన్లు సమర్థవంతంగా పనిచేయడానికి పాంటోథెనిక్ ఆమ్లం అవసరం. ఏదైనా వ్యాధికి చికిత్స జరుగుతున్న సమయంలో సమర్థవంతమైన ఫలితాలు రావడానికి తోడ్పడుతుంది. గాయాలు త్వరగా మానడానికీ సహాయపడుతుంది.
- పుట్టగొడుగులు, చిక్కుడు, బఠానీ వంటి కాయధాన్యాలు, పెసర, ఉలవలు వంటి పప్పు ధాన్యాలు, పాలు, గుడ్లు, కోడి మాంసం, చేపలు, పెరుగు, బ్రాకొలీ, క్యాబేజీ, చిలగడదుంప, తృణ ధాన్యాలు, కాలేయం, కిడ్నీలు వంటి వాటిలో పాంటోథెనిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది.
- ఆరు నెలల్లోపు శిశువులకు రోజుకు 1.7 మిల్లీగ్రాముల విటమిన్ బి5 అవసరం. 7 నెలల నుంచి మూడేళ్ల చిన్నారులకు 2 మిల్లీగ్రాములు, మూడు నుంచి 13 ఏళ్ల వారికి 3.5 మిల్లీగ్రాములు, 14 ఏళ్లు దాటినవారికి రోజుకు 5 మిల్లీగ్రాములు అవసరం. గర్భిణులు, పిల్లలకు పాలిచ్చే బాలింతలు మరింత ఎక్కువగా ఈ విటమిన్ అందేలా చూసుకోవాలి.
పైరిడాక్సిన్ తో మంచి ఎదుగుదల
శరీర ఎదుగుదలకు, మెదడు ఆరోగ్యంగా ఉండడానికి అత్యంత ఆవశ్యకమైనది విటమిన్ బి6 (పైరిడాక్సిన్). పిండి పదార్థాలు, అమైనో ఆమ్లాలు, కొవ్వులు జీర్ణం కావడానికి ఇతర బి కాంప్లెక్స్ విటమిన్లతోపాటు పైరిడాక్సిన్ కూడా అవసరం. ముఖ్యంగా ప్రొటీన్ల సంశ్లేషణకు, ఎర్ర రక్త కణాలు ఏర్పడడానికి ఇది అత్యవసరం. అసలు భూమిపై మొట్ట మొదటి జీవజాలం ఎదుగుదలకు ఈ విటమినే కారణమని శాస్త్రవేత్తలు పేర్కొంటూ ఉంటారు. మన శరీరానికి పైరిడాక్సిన్ అవసరం ఎక్కువ. దాంతోపాటు ఇది శరీరంలో నిల్వ ఉండని కారణంగా ఎప్పటికప్పుడు అందేలా చూసుకోవడం ముఖ్యం. విటమిన్ బి6 లేకుండా మన శరీరం విటమిన్ బి12ను సంగ్రహించలేదు. వివిధ గ్రంథులు విడుదల చేసే హార్మోన్లను ఉత్తేజితం చేయడానికి, కణాల ఆరోగ్యానికి, శక్తి సద్వినియోగానికి ఇది తోడ్పడుతుంది. రక్తంలో హోమోసిస్టిన్ అనే అమినో ఆమ్లం స్థాయిలను పైరిడాక్సిన్ నియంత్రిస్తుంది. తద్వారా గుండెపోటు, వ్యాధులను దూరంగా ఉంచుతుంది. కిడ్నీలలో రాళ్లు ఏర్పడడాన్ని నిరోధిస్తుంది. మహిళలు, పిల్లల ఆరోగ్యానికి విటమిన్ బి6 కావాలి. గర్భంలో ఉన్న సమయంలో, పుట్టిన తర్వాత కొద్ది రోజుల వరకూ శిశువుల్లో మెదడు ఎదుగుదల కోసం, రోగనిరోధక శక్తి పెంపొందడం కోసం ఇది హెచ్చుస్థాయిలో అవసరం. ఇక మహిళల్లో రుతుక్రమానికి ముందు వచ్చే సమస్యలు (ప్రీ మెన్ స్ట్రువల్ సిండ్రోమ్), గర్భం దాల్చడం కోసం ఆందోళన, మోనోపాజ్ లక్షణాల నుంచి ఉపశమనం కోసం పైరిడాక్సిన్ తోడ్పడుతుంది. ఇక మార్నింగ్ సిక్ నెస్ (గర్భంతో ఉన్న మహిళల్లో వాంతులు కావడం) లక్షణాలను తగ్గించడానికి విటమిన్ బి6 తోడ్పడుతుందని స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ పరిశోధకులు గుర్తించారు.
నాడీ వ్యవస్థకు అత్యంత కీలకం
బి కాంప్లెక్స్ విటమిన్లు అన్నింటిలోకీ బి6 ప్రత్యేకమైనది. మెదడులో కొన్ని రకాల న్యూరో ట్రాన్స్ మిటర్లను ఇది తయారుచేస్తుంది. నాడీ కణాల్లో ఒక దాని నుంచి మరొకదానికి సమాచారాన్ని సరఫరా చేసే రసాయనాలనే న్యూరోట్రాన్స్ మిటర్స్ అంటారు. మెదడు ఆరోగ్యంగా ఉండడానికి, సమర్థవంతంగా పనిచేయడానికి, శరీరంలో వివిధ గ్రంథులు హార్మోన్లు తయారుచేయడానికి, మన భావావేశాలకు, నిద్ర స్థాయిలను నిర్దేశించేందుకు ఈ రసాయనాలు ఎంతో కీలకం. ఈ న్యూరో ట్రాన్స్ మిటర్స్ తగిన స్థాయిలో ఉత్పత్తి కాకపోవడం వల్ల కుంగుబాటు, గందరగోళం వంటి మానసిక సమస్యలు తలెత్తుతాయి. పెద్ద వయసు వారిలో అల్జీమర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లల్లో ఈ విటమిన్ లోపం కారణంగా ఫిట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.
లోపిస్తే ఎన్నో సమస్యలు
ఇతర బి కాంప్లెక్స్ విటమిన్ల తరహాలోనే విటమిన్ బి6 (పైరిడాక్సిన్) కూడా చాలా రకాల ఆహార పదార్థాల్లో విస్తృతంగా లభిస్తుంది. కానీ ఇది శరీరంలో నిల్వ ఉండే అవకాశం లేనందున చాలా మందిలో స్వల్ప స్థాయిలో లోపం కనిపిస్తుంది. సరైన పోషకాహారం తీసుకోనివారు, ఆల్కాహాల్ ఎక్కువగా తీసుకునేవారు, హైపర్ థైరాయిడిజం, ఆటో ఇమ్యూన్ వ్యాధులు, కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో, జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నవారిలో పైరిడాక్సిన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ లోపం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బాగా బలహీనపడుతుంది. రక్తహీనత ఏర్పడుతుంది. చర్మంపై దద్దుర్లు, మంటలు, పెదవులు పగలడం, నోటి మూలల్లో పగుళ్లు, నాలుక వాపు, అల్సర్లతో పాటు మానసిక కుంగుబాటు (డిప్రెషన్), గందరగోళం వంటివి తలెత్తుతాయి. అరచేతులు, పాదాల్లో తిమ్మిర్లు వస్తాయి.
- 14 నుంచి 50 ఏళ్లలోపు స్త్రీ, పురుషులకు రోజుకు 1.3 మిల్లీగ్రాముల విటమిన్ బి6 అవసరం. 50 ఏళ్లు పైబడిన పురుషులకు 1.7, స్త్రీలకు 1.5 మిల్లీగ్రాముల చొప్పున అందాలి. ఇక ఆరు నెలల్లోపు చిన్నారులకు 0.1 మిల్లీగ్రాములు, ఆర్నెల్ల నుంచి మూడేళ్ల వరకు 0.5, నాలుగు నుంచి 13 ఏళ్ల వరకు 1 మిల్లీగ్రాము, గర్భిణులు, పిల్లలకు పాలిస్తున్న బాలింతలకు 2 మిల్లీగ్రాములు పైరిడాక్సిన్ అవసరం.
- బీన్స్, చికెన్, మాంసం, కాలేయం, గుడ్లు, చేపలు, ఆకుకూరలు, బొప్పాయి, నారింజ, తర్బూజ, అరటిపండ్లు, తృణధాన్యాల్లో పైరిడాక్సిన్ లభిస్తుంది. అయితే ఎక్కువగా వేడి చేయడం వల్ల ఇది నశిస్తుంది.
- విటమిన్ బి6 మోతాదు చాలా ఎక్కువైతే నీరసం, నాడులు దెబ్బతినడం, ఎండ పడకపోవడం, తలతిరగడం వంటి దుష్పరిణామాలు తలెత్తుతాయి.
బయోటిన్ తో అందం కూడా..
ఆరోగ్యంతోపాటు అందానికి కూడా తోడ్పడే విటమిన్ బయోటిన్ (విటమిన్ బి7). శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగడానికి, అత్యంత ముఖ్యమైన ఎంజైములను తయారు చేయడానికి,  గర్భంలో శిశువు ఎదగడానికి ఈ విటమిన్ అత్యవసరం. అంతేకాదు గోళ్లు, వెంట్రుకలు బలంగా పెరగడానికి, చర్మం ఆరోగ్యంగా ఉండడానికి ఇది తోడ్పడుతుంది. అందుకే దీనిని విటమిన్ హెచ్ (హెయిర్ విటమిన్) అని పిలుస్తుంటారు. మిగతా బి కాంప్లెక్స్ విటమిన్ల తరహాలోనే చర్మం, నాడీ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి, ఆరోగ్యంగా ఉండడానికి బయోటిన్ తోడ్పడుతుంది. శరీరంలో ఫ్యాటీ యాసిడ్లను, గ్లూకోజ్ ను తయారు చేయడానికి అవసరమవుతుంది. చిన్న పిల్లల్లో చర్మ రుగ్మతలను తగ్గించడానికి తోడ్పడుతుంది. మల్టీపుల్ స్ల్కీరోసిస్, మధుమేహం వ్యాధుల లక్షణాలను తగ్గిస్తుంది.
లోపిస్తే..
బయోటిన్ ఆహార పదార్థాల ద్వారా స్వల్పంగానే లభిస్తుంది. కానీ మన శరీరంలోని చిన్న పేగుల్లో ఉండే బ్యాక్టీరియా బయోటిన్ ను సంశ్లేషణ చేస్తుంది. అందువల్ల దీని లోపం పెద్దగా కనిపించదు. ఆల్కాహాల్ ఎక్కువగా తీసుకోవడం, ధూమపానం, సరైన పోషకాహారాన్ని తీసుకోకపోవడం, అతిగా యాంటీ బయాటిక్స్ వినియోగించడం ద్వారా బయోటిన్ లోపం ఏర్పడుతుంది. దీని లోపం వల్ల గోళ్లు పెళుసుబారిపోతాయి. వెంట్రుకలు సన్నబడి రాలిపోతాయి. నీరసం, కండరాల నొప్పులు, చర్మ రుగ్మతలు, గందరగోళం, తీవ్రమైన నీరసం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. బయోటిన్ లోపంతో గుండె సమస్యలూ వచ్చే అవకాశముంది. గర్భిణుల్లో, పిల్లలకు పాలిచ్చే బాలింతల్లో బయోటిన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. వారికి సరైన పోషకాహారంతోపాటు సప్లిమెంట్ల రూపంలోను అందజేయాల్సి ఉంటుంది.
కొన్ని ముఖ్యమైన అంశాలు
- 18 ఏళ్లు దాటిన సాధారణ వ్యక్తులకు రోజుకు 30 మైక్రోగ్రాముల వరకు బయోటిన్ అవసరం. ఆరు నెలల్లోపు చిన్నారులకు 5 మైక్రోగ్రాములు, ఏడు నెలల నుంచి మూడేళ్ల వారికి 8, నాలుగేళ్ల నుంచి ఎనిమిదేళ్లవారికి 12, తొమ్మిదేళ్ల నుంచి 18 ఏళ్లవారికి 20-25 మైక్రోగ్రాముల విటమిన్ బి7 అవసరం.
- బయోటిన్ ముఖ్యంగా కాలేయం, చికెన్, కాలీఫ్లవర్, క్యారెట్లు, అరటి, సోయా పిండి, ఈస్ట్, పొట్టు తీయని ధాన్యాలు, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు, వేరుశనగ వంటి నూనె గింజల్లో లభిస్తుంది.
- బయోటిన్ ను తీసుకోవడం ద్వారా మహిళల్లో శిరోజాలు ఎదుగుదల పెరిగినట్లుగా ఆల్బన్ స్కిన్ ఇనిస్టిట్యూట్ రీసెర్చ్ సెంటర్, కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తల సంయుక్త పరిశోధనలో వెల్లడైంది.
- టైప్-2 మధుమేహంతో బాధపడుతున్నవారికి బయోటిన్ తోపాటు క్రోమియం పికోలినేట్ కలిపి చికిత్స అందిస్తే.. వారిలో గ్లూకోజ్ జీవక్రియ మెరుగవుతుందని అమెరికాలోని ఆల్ఫా థెరపీ వైద్యులు గుర్తించారు. అంతేగాకుండా మధుమేహం వల్ల నాడీ కణాలు దెబ్బతినడాన్ని కూడా నియంత్రిస్తుందని వారు చెబుతున్నారు.
అమ్మలాంటి ఫోలిక్ యాసిడ్
బి కాంప్లెక్స్ విటమిన్లలో అత్యంత ముఖ్యమైనది విటమిన్ బి9 (ఫోలిక్ యాసిడ్). ముఖ్యంగా గర్భిణులకు ఇది అత్యంత ఆవశ్యకం. ఇది ఫోలేట్, ఫోలిక్ యాసిడ్ అనే రెండు రూపాల్లో ఉంటుంది. శరీరం ఎదుగుదల, మంచి ఆరోగ్యం కోసం ఈ విటమిన్ తోడ్పతుంది. విటమిన్ బి12తో కలసి ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. కణాల్లోని జన్యు పదార్థాలైన డీఎన్ఏ, ఆర్ ఎన్ఏల తయారీలో ఇది కీలకం. ఇక మెదడు పనితీరును మెరుగుపర్చడంతోపాటు మానసిక, ఉద్వేగపూరిత ప్రవర్తనకు, ఆరోగ్యానికి ఫోలిక్ యాసిడ్ తోడ్పడుతుంది. ముఖ్యంగా శరీరంలో కణాల పెరుగుదల వేగం చాలా ఎక్కువగా ఉండే సమయాల్లో.. అంటే చిన్నారులు, యుక్త వయసులో, గర్భంతో ఉన్న మహిళలకు ఫోలేట్ చాలా అవసరం. ఇక రక్తంలో హోమోసిస్టీన్ స్థాయులను తగ్గించి తద్వారా గుండెకు మేలు చేస్తుంది. మతిమరపు, అల్జీమర్స్, వృద్ధాప్యంలో వచ్చే మానసిక సమస్యలను నియంత్రించడంలో ఫోలిక్ యాసిడ్ సహకరిస్తుంది. గ్యాస్ట్రిక్ (జీర్ణాశయ సంబంధిత) కేన్సర్లు వచ్చే అవకాశాన్ని ఫోలిక్ యాసిడ్ తగ్గిస్తుందని షాంఘై సెకండ్ మెడికల్ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు.
గర్భిణులు తప్పనిసరిగా తీసుకోవాల్సిందే.
గర్భంతో ఉన్న మహిళల్లో శరీరంలో కొత్త కణాల పెరుగుదల ఎక్కువ స్థాయిలో ఉంటుంది. అదే సమయంలో గర్భంలో శిశువు నాడీ వ్యవస్థ ఎదుగుదలకు ఫోలేట్ అత్యవసరం. గర్భం ధరించిన తొలి రోజుల్లో పిండం ఎదుగుదలలో కీలకమైన వెన్నెముక, నరాలు ఏర్పడుతాయి. ఈ దశలో తగినంత ఫోలేట్ అందకపోతే వెన్నెముకకు సంబంధించిన ‘న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్’ వచ్చే అవకాశముంది. ఇక నాడీ సంబంధిత లోపాలు, వెన్నెముక చీలిక వ్యాధి ఉండే ప్రమాదం ఉంది. దీనివల్ల నడుము కింది భాగం పక్షవాతానికి గురికావడమేకాదు.. మానసిక వికలాంగులుగా మారిపోతారు. ఇక తగినంత ఫోలిక్ యాసిడ్ లేకపోతే నెలలు నిండకుండానే ప్రసవమయ్యే అవకాశం ఉంటుంది. గర్భస్రావం కూడా జరుగవచ్చు. ఫోలేట్ లోపం అలాగే కొనసాగితే భవిష్యత్తులో గర్భధారణ సమస్యలు తలెత్తుతాయి. పిల్లలకు పాలిచ్చే బాలింతలకు కూడా ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా అవసరం. అందువల్ల వారు ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలతోపాటు వైద్యుల సూచనల మేరకు విటమిన్ సప్లిమెంట్లు కూడా తీసుకోవడం అత్యవసరం.
లోపిస్తే రక్త హీనత
ఫోలేట్, ఫోలిక్ యాసిడ్ రెండూ సాధారణంగా మనకు ఆహార పదార్థాల నుంచి లభిస్తాయి. ఆహారాన్ని ఎక్కువగా ఉడికించడం, సరైన పోషకాహారం తీసుకోకపోవడం, ఆల్కాహాల్, ధూమపానం వంటివి విటమిన్ బి9 లోపానికి కారణమవుతాయి. లోపం కారణంగా రక్త హీనత ఏర్పడుతుంది. ఫోలేట్ లోపిస్తే పెద్ద వయసు వారిలో ఎముకలు గుల్లబారిపోయి, విరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నాలుకపై అల్సర్లు, నొప్పి, చర్మ సమస్యలు, వెంట్రుకలు సన్నబడి రాలిపోవడం, చేతి గోర్లపై మచ్చలు, పెళుసుగా మారడం వంటి సమస్యలు వస్తాయి. నీరసం, అలసట, మగతగా ఉంటుంది. బరువు తగ్గిపోతారు. రక్తంలో ఫోలేట్ శాతాన్ని పరీక్షించడం ద్వారా దీని లోపాన్ని గుర్తిస్తారు.
ఎంత అవసరం..
- సాధారణ వ్యక్తులకు రోజుకు 400 మైక్రోగ్రాముల విటమిన్ బి9 అవసరం. అదే గర్భిణులు, పిల్లలకు పాలిచ్చే బాలింతలకు 600 మైక్రోగ్రాముల వరకు అవసరం.
- పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలు, కాలేయం, మాంసం, చేపలు, పాలు, గుడ్లు, ఈస్ట్, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, బీన్స్, చిక్కుడు జాతి గింజలు, పప్పుధాన్యాలు, నారింజ, వేరుశనగ, పుట్టగొడుగుల్లో విటమిన్ బి9 లభిస్తుంది.
- దీర్ఘకాలంపాటు అధిక మోతాదులో విటమిన్ బి9ను తీసుకుంటే పలు దుష్పరిణామాలు తలెత్తుతాయి. కడుపులో తిమ్మిరి, చిరాకు, మానసిక సమస్యలు, నిద్ర లేమి, డయేరియా, దద్దుర్లు, చర్మ సమస్యలు, వికారం, గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మరీ ఎక్కువ మోతాదులో తీసుకున్నవారికి గుండె పోటు వచ్చే ప్రమాదమూ ఉంది.
సయానో కోబాలమైన్ తో సంపూర్ణ ఆరోగ్యం
శరీరానికి అత్యంత ముఖ్యమైన విటమిన్లలో విటమిన్ బి12 ప్రధానమైనది. దీని రసాయనిక నామం సయానో కోబాలమైన్. శరీరంలోని దాదాపు అన్ని ప్రధాన అంగాలు ఆరోగ్యకరంగా ఉండడానికి ఇది అవసరం. ముఖ్యంగా మెదడు, నాడీ వ్యవస్థ, ఎర్ర రక్త కణాలు, డీఎన్ఏ, ప్రొటీన్లు, హార్మోన్లు తయారుకావడానికి ముఖ్యమైనది సయానో కోబాలమైన్. రోగ నిరోధక వ్యవస్థను ఇది బలోపేతం చేస్తుంది. మానసిక స్థితిని చైతన్యవంతం చేస్తుంది. ఏకాగ్రతను పెంచుతుంది. బ్రెస్ట్ కేన్సర్, ఊపిరితిత్తులు, సర్వైకల్ కేన్సర్లను నిరోధించడానికి తోడ్పడుతుంది. పురుషుల్లో వ్యంధ్యత్వం, నిద్రలేమి సమస్యలు, మానసిక కుంగుబాటు, మల్టీపుల్ స్క్లీరోసిస్, అలర్జీలు, చర్మ సమస్యలకు చేసే చికిత్సలో విటమిన్ బి12 సప్లిమెంట్లను కూడా వైద్యులు ఇస్తారు.
నాలుగైదేళ్ల దాకా నిల్వ..
సాధారణంగా బి కాంప్లెక్స్ విటమిన్లు అవసరానికి మించి శరీరంలో ఉంటే మూత్రం ద్వారా విసర్జించబడతాయి. కానీ ఒక్క విటమిన్ బి12 (సయానో కోబాలమైన్) మాత్రం శరీరంలోని కాలేయం, ఇతర కణజాలాల్లో నిల్వ ఉంటుంది. అందువల్ల దీని లోపం ప్రారంభమైనా మూడు నుంచి ఐదేళ్ల వరకు బయటపడదు. అయితే కాలేయ సంబంధిత వ్యాధులు, సమస్యలున్నవారిలో విటమిన్ బి12 నిల్వ ఉండదు. దాంతో వెంటనే లోపం కనిపించే అవకాశం ఉంటుంది. ఇక గ్యాస్ సమస్య, ఇతర గ్యాస్ట్రో ఎంటరాలజీ సమస్యల కారణంగా యాంటాసిడ్ మాత్రలు ఉపయోగించే వారిలో విటమిన్ బి12 శరీరానికి అందదు. వారు మరింతగా విటమిన్ బి12 తీసుకోవాల్సి ఉంటుంది.
శాకాహారుల్లో లోపం ఎక్కువ..
విటమిన్ బి12 ఎక్కువగా మాంసాహారంలోనే లభిస్తుంది. అందువల్ల శాకాహారుల్లో దీని లోపం ఎక్కువగా కనిపిస్తుంది. దాంతోపాటు వయసు మీదపడినవారికి, గర్భిణులకు సయానో కోబాలమైన అవసరం చాలా ఎక్కువ. చిన్నపేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువగా చేరడం, ఇన్ ఫ్లమేటరీ బొవెల్ డిసీజ్ (జీర్ణాశయం, చిన్న పేగులకు సంబంధించిన వ్యాధి), టేప్ వార్మ్ ఇన్ఫెక్షన్, ఎయిడ్స్, యాంటాసిడ్ మందుల వినియోగం, జీర్ణాశయంలో ఆమ్లత్వం తగ్గిపోవడం (పెద్ద వయసువారిలో కనిపిస్తుంది), రోగ నిరోధక వ్యవస్థ అతి చురుకుదనం వంటివాటి కారణంగా బి12 లోపం ఏర్పడుతుంది. ఈ లోపం వల్ల రక్త హీనత, ఆకలి మందగించడం, నీరసం, బలహీనత, కుంగుబాటు, ఆలోచించలేకపోవడం, చేతులు, కాళ్లు వణకడం, సరిగా నడవలేకపోవడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, నోరు, నాలుక వాపు, నొప్పులు, భయానకమైన ఊహలు, చనిపోతామేమోనన్న భయం (పారానోయియా) వంటి లక్షణాలు తలెత్తుతాయి. 
50 ఏళ్లు పైబడినవారిలో జీర్ణాశయం లోపలిపొర సన్నబడడం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి. దాంతో వారిలో శరీరం విటమిన్ బి12ను సరిగా సంగ్రహించలేదు. మరికొంత మందిలో విటమిన్ బి12ను ఆహారం నుంచి సంగ్రహించే ప్రొటీన్ (ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్) సరిగా ఉత్పత్తి కాదు. అలాంటి వారు మరింతగా విటమిన్ బి12 అందేలా చూసుకోవాలి. 60 ఏళ్లు పైబడిన వారిలో దీని లోపం కారణంగా నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. ఇక గర్భిణుల్లో విటమిన్ బి12 స్థాయులు తక్కువగా ఉంటే.. పుట్టబోయే పిల్లలపై ప్రభావం పడుతుంది. రక్తంలో సయానో కోబాలమైన్ శాతాన్ని పరీక్షించడం ద్వారా దీని లోపాన్ని గుర్తించవచ్చు. 
ఎంత అవసరం
*సాధారణ వ్యక్తులకు రోజుకు 2.4 మైక్రోగ్రాముల విటమిన్ బి12 అవసరం. గర్భిణులు, పిల్లలకు పాలిస్తున్న బాలింతలకు 2.8 మైక్రోగ్రాములు కావాలి. 
* దాదాపు అన్ని రకాల మాంసాహారాల్లో విటమిన్ బి12 లభిస్తుంది. ముఖ్యంగా నత్తలు, పీతలు, చేపలు, కాలేయంలలో అత్యధిక మోతాదులో ఉంటుంది. ఇక పాలు, పాల పదార్థాల్లోనూ లభిస్తుంది. 
*సాధారణ రక్త పరీక్షల ద్వారా కూడా విటమిన్ బి12 లోపాన్ని గుర్తించవచ్చు. ఈ లోపమున్నవారి రక్తంలోని ఎర్రరక్త కణాలు నిర్ధారిత పరిమాణానికి మించి పెద్దగా ఉంటాయి. అవసరమైతే ఎండోస్కొపీ ద్వారా జీర్ణాశయం లోపలి కణాలను పరిశీలిస్తారు.
* ఈ విటమిన్ లోపం ఉన్నవారు సప్లిమెంట్ల రూపంలో తీసుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఇంజెక్షన్ రూపంలోనూ ఇస్తారు. దీని మోతాదు మించడం వల్ల పెద్దగా దుష్ప్రభావాలేమీ ఉండవని వైద్య నిపుణులు చెబుతున్నారు.
వీటిని ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిందే..
బి, సి విటమిన్లు నీటిలో కరిగే విటమిన్లు. ఇవి చాలా రకాల ఆహార పదార్థాల ద్వారా శరీరానికి అందుతాయి. కానీ వీటికి స్థిరత్వం తక్కువ. ఎక్కువగా వేడి చేస్తే నశించిపోతాయి. అంటే ఆహారాన్ని ఎక్కువగా ఉడికించినా, ఫ్రైలు, వేపుళ్లు వంటివి చేసినా ఈ విటమిన్లు నశిస్తాయి. దీంతో శరీరానికి బి, సి విటమిన్లు అందక లోపం ఏర్పడుతుంది. 
* ఆహార పదార్థాలను తాజాగా ఉంచుకోవాలి. నేరుగా ఎండ, వేడి వాతావరణంలో ఉంచవద్దు. అవసరమైతే రిఫ్రిజిరేటర్ లో పెట్టుకోవచ్చు. కానీ ఎక్కువ రోజులు నిల్వ చేయవద్దు.
* ఆహారాన్ని ఎక్కువగా వేడి చేయవద్దు. లేదా తాజా పండ్లు, పచ్చి కూరగాయలు తీసుకోవాలి.
* కూరగాయలు ఉడికించిన నీటిని పారబోయకుండా.. సూప్ ల తయారీకి వినియోగించుకోవాలి.
* రోజూ కనీసం ఒక నిమ్మ (సిట్రస్) జాతికి చెందిన పండును తినాలి.