పేజీలు

8, ఆగస్టు 2016, సోమవారం

కారు కొనాలంటే... ఈ 9 విషయాలు తెలుసుకోవాలి!

ప్రస్తుతం ఏ కారు కొన్నా బీమా చేయించాల్సిందే. ఈ భారం నుంచి తప్పించుకునే మార్గమే లేదు. మరి కారు బీమా ప్రీమియం ఏయే అంశాల ఆధారంగా నిర్ణయిస్తారు. చాలా మందికి ఈ విషయాలు తెలియవు. కారు బీమా ప్రీమియాన్ని ఎలా నిర్ణయిస్తారో తెలుసుకుందాం.

 
ప్రీమియం నిర్ణయించే అంశాలు  


 
డ్రైవింగ్‌ చరిత్ర 
కారు బీమా ప్రీమియం నిర్ణయించడంలో మీ డ్రైవింగ్‌ చరిత్ర ముఖ్య పాత్ర వహిస్తుంది. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించకుండా అడ్డదిడ్డంగా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసే వ్యక్తుల కార్లపై, మిగతా వారితో పోలిస్తే బీమా ప్రీమియం ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి మహానుభావుల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే బీమా కంపెనీలు ఇలాంటి వారి కార్లపై ఎక్కువ ప్రీమియం వసూలు చేస్తుంటాయి. చిన్న వయసులోనే చక్కగా డ్రైవింగ్‌ నేర్చుకుని ప్రమాదాలు లేకుండా, ట్రాఫిక్‌ రూల్స్‌ పాటిస్తుంటే మీ కారుపై చెల్లించాల్సిన ప్రీమియం భారమూ తగ్గుతుంది.
 
కారు ధర
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, కారు ధర కూడా బీమా ప్రీమియం నిర్ణయంలో కీలక పాత్ర వహిస్తుంది. హ్యాచ్‌బ్యాక్‌ లేదా కాంపాక్ట్‌ సెడాన్‌లతో పోలిస్తే ఎస్‌యువిలు, లగ్జరీ కార్లపై బీమా ప్రీమియం చాలా ఎక్కువ. ఎందుకంటే ఈ వాహనాలు ప్రమాదానికి లోనైతే రిపేరు ఖర్చులు, విడి భాగాల కోసం బీమా కంపెనీలు ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఎంత చెట్టుకు అంత గాలన్న మాట. మంచి సేఫ్టీ ఫీచర్లు ఉండి, పెద్దగా ప్రమాదాలకు లోనయ్యే అవకాశం లేని కార్లకైతే బీమా కంపెనీలు ప్రీమియం చెల్లింపు విషయంలో రాయితీలు కూడా ఇస్తాయి.
 
కారు మైలేజ్‌.. 
కారును కొన్న తరువాత అది ఎన్ని కిలోమీటర్లు నడిచిందనే విషయం కూడా ఆటోమొబైల్‌ బీమా ప్రీమియం నిర్ణయంలో కీలక పాత్ర వహిస్తుంది. ఏదైనా కారు తక్కువ కిలోమీటర్లు ప్రయాణించిందంటే యజమాని, ఆ కారును తరచుగా ఉపయోగించడం లేదని అర్థం. ఎక్కువగా ఉపయోగించని కార్లు ప్రమాదాలకు లోనయ్యే అవకాశమూ చాలా తక్కువే. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని బీమా కంపెనీలూ అలాంటి కార్లకు మిగతా కార్లతో పోలిస్తే ప్రీమియం తక్కువగానే నిర్ణయిస్తాయి.
 
కారు వినియోగ తీరు 
కారును వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగిస్తున్నామా? లేక వాణిజ్య అవసరాల కోసం ఉపయోగిస్తున్నామా?అనే విషయాన్ని బట్టి కూడా, కారు ప్రీమియం ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగత ఉపయోగంతో పోలి స్తే వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే కార్లను క్లిష్టమైన పరిస్థితుల్లోనూ ఎక్కువగా ఉపయోగించాల్సి ఉంటుంది. దీంతో ప్రైవేట్‌ వాహనాలతో పోలిస్తే, వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే మోటారు వాహనాల బీమా ప్రీమియం ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది.
 
భద్రతా సదుపాయాలు 
బీమా ప్రీమియం నిర్ణయంలో కారులో ఉండే సేఫ్టీ ఫీచర్లదీ కీలక పాత్రే. పాత కార్లతో పోలిస్తే ప్రస్తుతం మార్కెట్‌లో విడుదలవుతున్న కార్లలో ఎయిర్‌ బ్యాగ్స్‌, యాంటీ తెఫ్ట్‌ లాక్‌, అడ్వాన్స్‌డ్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ వంటి అనేక సేఫ్టీ ఫీచర్లు ఉంటున్నాయి. బీమా కంపెనీలు పాత కార్లతో పోలిస్తే ప్రస్తుతం విడుదలవుతున్న కొత్త కార్లపై ప్రీమియం తక్కువగా వసూలు చేస్తాయి. కారులో ఎఆర్‌ఎఐ ఆమోదిత యాంటీ తెఫ్ట్‌ పరికాలు అమర్చుకున్నా....ప్రీమియం భారం తగ్గుతుంది.
 
మీరుండే ప్రాంతం 
వినడానికి విచిత్రంగా ఉన్నా మనం ఉండే ప్రాంతం కూడా మన కారు బీమా ప్రీమియాన్ని నిర్ణయిస్తుంది. మనం ఉండే ప్రాంతంలో దొంగతనాలు, విధ్యంసాలు ఎక్కువగా జరుగుతుంటే, బీమా కంపెనీలు ప్రీమియం ఎక్కువగా వసూలు చేస్తాయి. సాధారణంగా చిన్న చిన్న పట్టణాలతో పోలిస్తే మెట్రో నగరాల్లోని కార్లకు దొంగతనాలు, విధ్వంసాల భయం తక్కువగా ఉంటుంది. దాంతో బీమా కంపెనీలూ ఆ కార్లపై తక్కువ ప్రీమియం వసూలు చేస్తుంటాయి. 

వ్యక్తిగత అంశాలు 
కారు యజమాని వయసు, నడిపించే వాళ్లు (పురుషుడు లేదా స్ర్తీ) అనే అంశాలు, వైవాహిక స్థితి కూడా కారు బీమా ప్రీమియాన్ని నిర్ణయిస్తాయి. ఉదాహరణకు పెళ్లికాకుండా పాతికేళ్ల లోపు వయసు యువకులు ప్రమాదాలు చేసే అవకాశం ఎక్కువ. దీంతో బీమా కంపెనీలు వారి కార్లపై, మిగతా వారితో పోలిస్తే ప్రీమియం ఎక్కువగా వసూలు చేస్తుంటాయి. టీనేజ్‌ కుర్రాళ్ల కార్లపై ప్రీమియం మరింత ఎక్కువగా ఉంటుంది.

సర్వీసింగ్‌ 
ఎప్పటికపుడు సర్వీసింగ్‌ చేయిస్తుంటే కారు నిర్వహణా బాగుంటుంది. బీమా కంపెనీలు ప్రీమియం నిర్ణయించేటపుడు ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటాయి. కంపెనీ చెప్పినట్టు క్రమం తప్పకుండా సర్వీసింగ్‌ చేయించే కార్లపై మిగతా కార్లతో పోలిస్తే బీమా ప్రీమియమూ తక్కువగా ఉంటుంది.
 
క్రెడిట్‌ చరిత్ర 
చాలా మంది తమ క్రెడిట్‌ చరిత్ర.. రుణాలు తీసుకోవడం ఒక్కదాన్నే ప్రభావితం చేస్తుందనుకుంటారు. కారు బీమా ప్రీమియాన్ని కూడా ఈ విష యం ప్రభావితం చేస్తుందనే విషయం చాలా మంది కి తెలియదు. కారు యజమాని క్రెడిట్‌ హిస్టరీ ఎంత బాగుంటే, బీమా కంపెనీలు కారు ప్రీమియాన్ని అంతగా తగ్గిస్తాయి.
 
కాబట్టి కారు ఇన్సూరెన్స్‌ తీసుకు నే ముందే, మంచి క్రెడిట్‌ స్కోరు పొందడం మంచిది. ఈ విషయాలన్నీ గుర్తుంచుకుంటే కారు బీమా ప్రీమియంలోనూ మంచి డిస్కౌంట్‌లు పొందవచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి